బ్రహ్మమిది..బ్రహ్మకడిగిన పాదం ఇది
బూడిద ఇది బండరాయిపై రాజిల్లిన వెలుగు ఇది
బ్రహ్మము తానే జన్మము తానే శవం తానే శివం తానే
కొత్తగా వచ్చే తోడు ఇవన్నీ ఎలా తెల్సుకుంటుంది
పెరిగి విరిగే నీడ ఎందుకని నియంతలా శాసిస్తోంది
ప్రథమాది గా స్వరం శూన్యం చెంత అధమాథమంగా దుఃఖం వెలుగు చెంత
కనుక వెలుగు చీకటి ఒక్కటి కావు కదా! వెలిగే చీకటి వేడుక కాదు కదా!
కనుక దేవుడు దెయ్యం బ్రహ్మమూ బయ్యమూ ఏవీ ఒక్కటి కావు
వియ్యమూ కయ్యమూ తప్పవురో.. ఓ కమ్యూనిస్టు దేవుడా…!
శివయ్యా నీకిదే వినుతి !
నిర్జీవ సహిత జ్ఞాపకం గత రేయి చెంత ఆమెని కలిసిన సందర్భం. నది చెంత తేలిన జీవగతి.. ఆఖరి మజిలీ.. మరణానికి కారుణ్యం ఉండదని తేల్చేసింది. మరి! ఈ కారుణ్య మరణాలేంటో తేలడం లేదు. దేహాన్ని ఖండితాలుగా మార్చిన సందర్భాల్లో జీవుడు నరక గతిని పొందుతున్నాడా.. స్వర్గ లోక ప్రాప్తి అందుకుంటున్నాడా.. మరి! స్వర్గమూ నరకమూ అన్నీ ఇక్కడే కదా! మళ్లీ కొత్త లోకాలేంటి..? మరణం నిన్నటి పతనానికి ఆనవాలు. నదిలో మూలాలు జ్ఞాపకాలను కడతేర్చిన కన్నీళ్లకు ఆనవాలు. మిగులు జలాలన్నవి మీలోనూ నాలోనూ తప్పక మిగిలే ఉండాలి. ఇంకా చావు కోసం చచ్చీ చావని బతుకు కోసం మనం నిరీక్షించాలి. ఇది మాయ అంటావా..! ఏమో వాడెవ్వడో ప్రశ్నించిన తీరున నేను ప్రశ్నించను. కానీ ఏదీ మాయా కాదు మిథ్యా కాదు .. నేనొక భౌతికాన్ని నేనొక శిలగా మారిన శాసనాన్ని.. వాక్కుతో శాసించు లక్షణం నాదే..
జీవ చైతన్యాన్ని పతనావస్థకు చేర్చి శ్మశాన లోగిళ్లు భలే ఆనందిస్తున్నాయి. నాలుగంటే నాలుగే రాళ్లు పోగు పడి సమాధి స్థితిని సమతా స్థితికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాయి. జననం మాయ కాదు బతుకు మాయ .. మరణం మాయ కాదు జీవితేచ్ఛ మాయ.. కానగ రాని కైవల్యాల చెంత రగిలి మిగిలిన వెలుగు జ్వాజ్వల మానం అని ఎవరు అన్నారు. రెండు కాని ఒక్కటి అదే అద్వైతం.. ఏ ఒక్కటి మరో ఒక్కటితో ఒక్కటి కాదు. జీవం ఆత్మ వెరసి జీవాత్మ.. కానీ ఆ రెండు వేర్వేరు కదా!.. ఆత్మకు భ్రమణ చిత్తం ఉంటుంది.. జీవికి బతకాలన్న ఓ ఎరుక ఉంటుంది. చచ్చేదాక ఏ రెండూ ఒక్కటి కావు.. కనుక ఇది కానగరాని అద్వైతం.. ఏదో ఓ కూడలి చెంత కలుసుకుని కలహించుకునే వైదికం. కాలే కట్టే చెప్పునొక సత్యం.. భవతి వేదం వితతి నాదం అంటే ఇదే! ఏ నిశ్వాస దారుల్లో నేను పతనానికి చేరుకున్నానో ఏ దేహ కాంతిలో నేను ఆ రాత్రి మోక్షం పొందానో ఆ నిశ్వాసం ఆ నిర్గమం రెండూ ఒక్కటేనా.. పరస్పర విరుద్ధతలకు పరస్వరం ఆపాదించిన చాలు తోడ్కొనునొక వివాదం.. తోడు వచ్చునొక విభేదం. మనం..ఏ ఇద్దరిలో సారూప్యతలు వెతకరాదు.
ఒరేయ్ చావు దగ్గర తప్పిపోయినోడా ఇటురా..జ్ఞాపకాల్లో తప్పిపోయినోడా ఇటురా..బతుకు దారుల్లో వెలివేతల ఊతల్లో అవమానపు నిగూఢపు ఛాయల్లో తలదాచుకున్నోడా తలచెద నిన్ను/కొలిచెద నిన్ను.ఇలా ఆవహించరా..అద్వైత సిద్ధాంతానుసారం పారిమార్థిక చింతన ఎందాక.. లేని వాడి కోసం చింతన ఉన్న జాడ్యాలను పోగెట్టుకునేందుకో రహస్య సాధన.. చింతన పరం కాదు దుఃఖం వీడిపోదు.మరి! దుఃఖం కూడా మాయ గా పరిణమిస్తున్నావ్ సరే అది చేసిన గాయాలను నీవు చెరిపేయగలవా?? వెన్నాడు నీడలకు ఇవి తెలియునా?? గాయాలన్నీ స్వప్న ప్రావస్థలో పరిచయం అయితే ది గులు అన్నది లేదు కదా! సత్యానికి ఓ యథాతథ రూపం ఆమె జ్ఞాపకం.. వాటిని చిదిమేసిన నిన్నటి రేయి నాకు ఇది మాయ అని చెప్పలేదే??
మోహావస్థలకు మధ్యే మార్గం ఇదే అని అనలేదే?? కనుక లోకంలో మాయ లేదు ఉన్నది భ్రమణ కాంక్ష.. లోకంలో కలలు.. కాలం చెల్లిపోయాక కూడా జీవితం అను నదిలో తేలియాడుతూనే ఉంటాయి కొన్ని శవాల్లాగా.. శవానికి చైతన్యం ఇవ్వగలవా.. లేదు కదా! కనుక జీవుడు దేవుడు ఒక్కరే అంటే ఎలా.. కనిపించిన వాడికి కనిపించని వాడితో ఓ పోలికా ఇదేనా పిపీలికాది పర్యంతం వినవస్తోన్న బోధన. వైదికం దారి మాత్రమే పుణ్య లోకం పాప లోకం అన్నవి ఓ విభజన మాత్రమే ఆ పాటి రేఖలు చెరిపేశాక లోకంలో కానగవచ్చే సత్యమే జగద్గురువు.
– రత్నకిశోర్ శంభుమహంతి