జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. శుక్రవారం రోజు జమ్మూలోని సుంజ్వాన్ ప్రాంతానికి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముఖేష్ సింగ్ తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక భద్రతా అధికారి మరణించగా… 9 మంది గాయపడ్డారు. మరో రెండు రోజుల్లో ప్రధాన మంత్రి జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఉగ్రవాదులను జల్లెడపడుతున్న క్రమంలో ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం 4.25 గంటలకు జమ్మూలోని చద్దా క్యాంప్ వద్ద విధులు ముగించుకుని వెళ్తున్న క్రమంలో 15 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక ఏఎస్ఐ ప్రాణాలు కొల్పోగా… ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న ( గురువారం) బారాముల్లా జిల్లాలో ప్రారంభమైన ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉంది. నిన్న ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు 4 ఉగ్రవాదులను హతమార్చినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఇందులో అత్యంత కీలమైన లష్కరే తోయిబా టాప్ కమాండర్ ను హతమార్చారు.