తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. అధికార టీఆర్ఎస్ మంత్రులు ఎవరు మీడియా ముందుకు వచ్చినా.. రాహుల్ గాంధీ టూర్ పైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాహుల్ పై విమర్శలు గుప్పించారు. పబ్బులు, క్లబ్బుల్లో తిరిగే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కులేదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నేడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ పాలనలో దేశంలో 1,58,117 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పేరుకే ఏడు గంటల కరెంటు.. కానీ వచ్చింది మూడు గంటలు మాత్రమేనని తెలిపారు. నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతులను కాల్చి చంపించింది కాంగ్రెస్ వాళ్లుకాదా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఈ ఏడేళ్లలో వ్యవసాయంపై రూ. 3 లక్షల 87 వేల కోట్లు ఖర్సు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేసుకున్నామన్నారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా చెరువులన్నింటినీ నింపుకున్నామని తెలిపారు.