దుగ్గిరాల టీడీపీ ఎంపీటీసీలు, దుగ్గిరాల టీడీపీ నేతలు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలు జరిగిన విధానంపై చర్చించారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల్లో నైతిక విజయం టీడీపీదేనని, ప్రభుత్వం, పోలీసుల అండతో ఎమ్మెల్యే ఆర్కే ఎంపీపీ కుర్చీ కబ్జా చేశారన్నారు. ఐదుగురితో ఎంపీపీని ఎన్నుకోవడం వైసీపీ ఓటమేనని, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డ్రామాలకు కాలం చెల్లిందన్నారు. టీడీపీ ఎంపీటీసీలు, నేతలు, కార్యకర్తలు వైసీపీ దాడులకి భయపడకుండా నిలబడ్డారని, ఇదే స్ఫూర్తితో పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
మంగళగిరి నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగురేద్దామని, ఎంపీటీసీల బలం లేకున్నా.. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కుట్రలు కుతంత్రాలతో దుగ్గిరాల ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరితెగించి పాల్పడిన అక్రమాలపై టీడీపీ ఎంపీటీసీలు, నేతలు బలంగా పోరాడారని, దుగ్గిరాలలో కొందరు టీడీపీ అభ్యర్థుల్ని బెదిరించి విత్ డ్రా చేయించారన్నారు. చివరికి మైనారిటీ సోదరి జబీన్‌కి బీసీ కులధ్రువపత్రం రాకుండా చేశారని, ఎంపీటీసీల బలం లేకపోవడంతో టీడీపీ వాళ్లని బెదిరించి వైసీపీ వైపు తిప్పుకోవాలని చూశారని ఆయన ఆరోపించారు. ఒక్కతాటిపై నిలిచి తెలుగుదేశం సత్తా చాటారన్నారు.