లోన్స్ యాప్స్ రికవరీ ఏజెంట్స్ మరోసారి రెచ్చిపోతున్నారు. వ్యక్తిగత రుణాలు ఇస్తూనే.. వడ్డీ కింద వారి పరువును, ప్రాణాలను తీసుకుంటున్నారు. ‘రమ్య’ (పేరు మార్చాం) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. ఫాస్ట్ కాయిన్ అనే లోన్ యాప్లో వ్యక్తిగత అవసరాల కోసం రూ.18 వేలు రుణం తీసుకుంది. నెల రోజుల తర్వాత చక్రవడ్డీ కలుపుకొని రూ.25 వేలు చెల్లించింది. కానీ, యాప్లో మాత్రం పేమెంట్ జరిగినట్లు చూపించకపోవడంతో.. తెల్లారి ఆమెకు యాప్ కాల్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది ‘మీరింకా లోన్ కట్టలేదని, త్వరగా చెల్లించకపోతే మీ న్యూడ్ ఫొటోలను మీ కుటుంబీకులకు పంపిస్తామని’ బెదిరించారు. తెల్లారి అన్నంత పనీ చేసేశారు. దీంతో బాధితురాలు వెంటనే యాప్లో రూ.25 వేలు చెల్లించింది. ఇలా పలుమార్లు నిర్వాహకుల బెదిరింపులతో రూ. 2 లక్షలపైనే చెల్లించినా.. వదలకపోవటంతో బాధితురాలు నార్సింగి పీఎస్లో ఫిర్యాదు చేసింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లోన్ యాప్ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. వరుస అరెస్ట్లు, యాప్ బ్యాన్లతో ఏడాది పాటు కార్యకలాపాలకు దూరంగా ఉన్న లోన్ యాప్ నిర్వాహకులు మళ్లీ పంజా విసురుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లలో 60కి పైగా లోన్ యాప్ వేధింపుల కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.