తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ సర్కారును గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… అందుకోసం తాను తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్ను గద్దె దించేందుకు బండి సంజయ్ ఒక్కడే చాలని కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాలను సాధిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్…ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే నీళ్లు, నిధులు, నియామకాల హామీలను నెరవేరుస్తామని ఆయన చెప్పారు. ఈ హామీని నిలబెట్టుకునే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి… ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఆయన ప్రకటించారు.