అధికార పార్టీ అన్నాక అసంతృప్తి సెగలు.. అంతర్గత విభేదాలు సహజమే..అధికారం చెలాయించే క్రమంలో సొంత పార్టీ నేతల మధ్యే విభేదాలు పెరగొచ్చు..అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలని అందలం ఎక్కిస్తే..రచ్చ గట్టిగానే జరుగుతుంది. అసలైన కార్యకర్తలు..ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులని త్వరగా నెత్తిన పెట్టుకోవడం కష్టం. పైగా ఆ నాయకులపై పోరాటం కూడా చేస్తారు. ఇప్పుడు ఇదే పరిస్తితి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కనిపిస్తోంది.
గన్నవరం అంటే ముందు నుంచి టీడీపీ కంచుకోటే.. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు.. ఇక ఈయన టీడీపీలో ఉండగా, వైసీపీ నేతలకు, కార్యకర్తలకు చుక్కలు కనిపించాయని చెప్పొచ్చు. మరి అలా చుక్కలు చూపించిన నాయకుడు చివరికి వైసీపీ వైపుకు వచ్చేశారు.. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో ఉన్న తన సన్నిహితుల ద్వారా జగన్ కు దగ్గరయ్యారు. సరే వైసీపీలోకి వచ్చాక గన్నవరంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదా? అంటే అబ్బే గన్నవరం వైసీపీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది.
ఇప్పటికే వంశీకి.. వైసీపీ నేతలు దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావుల మధ్య రచ్చ జరుగుతుంది..వంశీ వర్గంపై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూనే ఉన్నారు..అలాగే వంశీ తన సొంత వర్గానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ…అసలైన వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉంటే ఇటీవల గన్నవరం వైసీపీ ఇంచార్జ్ ని నియమించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు..వంశీని పక్కన పెట్టి నిజమైన వైసీపీ నాయకుడుకు ఇంచార్జ్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా… గడపగడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది. 2024లో పార్టీ టికెట్ వంశీకి కేటాయిస్తే సహకరించమని పార్టీ అగ్రనేతలకు వైసీపీ అసమ్మతి వర్గం హెచ్చరికలు చేసింది. నియోజకవర్గంలో వైసీపీకి కొత్త ఇంఛార్జ్ కావాలంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. అలాగే జగన్ని కలిసి వంశీ సీటు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ అగ్రనేతలతో వంశీకి మంచి పరిచయాలు ఉన్నాయి…అలాగే కొడాలి నానికి స్నేహితుడు కాబట్టి వంశీకి సీటు విషయంలో డౌట్ లేదని తెలుస్తోంది. 2024లో గన్నవరం వైసీపీ సీటు తమ నేతకే అని వంశీ వర్గం అంటుంది. చూడాలి మరి చివరికి గన్నవరం సీటు ఎవరికి దక్కుతుందో?