ఏపీ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా మంత్రి రోజా తన అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆమెకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా నగరిలో నిన్న పర్యటించిన ఆమె ప్రజలను కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాలను అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మహిళలు రోజాను సత్కరించారు.
అయితే.. మంత్రి రోజాను కలిసిన ఓ వృద్ధుడిని నెలవారీ పింఛను అందుతుందా? అని ప్రశ్నించారు. అందుకతడు బదులివ్వకుండా తాను ఒంటరివాడనని, తనకెక్కడైనా పిల్లను చూడాలని, పెళ్లి కావాలంటూ విన్నవించాడు. దీంతో అవాక్కైన మంత్రి రోజా ఒక్కసారిగా నవ్వేశారు. ఆమెతోపాటు చుట్టుపక్కల ఉన్నవారు కూడా నవ్వును ఆపుకోలేకపోయారు. పెద్దాయన ప్రశ్నకు రోజా బదులిస్తూ తాను పెన్షన్లు మాత్రమే అందేలా చూడగలనని, అమ్మాయిలను చూడడం తన పని కాదని స్పష్టంగా చెప్పేశారు.