అధికారుల తెలివి అలా ఏడ్చింది.. ఆర్‌టీఐకి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే జీఎస్టీ క‌ట్టించుకున్నారు..!

-

మ‌న దేశంలో ఎలాంటి వ‌స్తువును కొన్నా, ఏ సేవ‌ను పొందినా దానికి జీఎస్‌టీ క‌ట్టాల్సిందే. జీఎస్‌టీ చెల్లిస్తేనే ఏ వ‌స్తువునైనా, సేవ‌నైనా మ‌నం పొంద‌గ‌లం. కానీ కొన్ని ర‌కాల సేవ‌ల‌కు మాత్రం జీఎస్‌టీ నుంచి మిన‌హాయింపు ఉంది. వాటిల్లో ఒక‌టి ఆర్‌టీఐ. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ఎవ‌రైనా ఏదైనా స‌మాచారం కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసుకుంటే దానికి జీఎస్టీ చెల్లించాల్సిన ప‌నిలేదు. కానీ అధికారుల తెలివిత‌క్కువ త‌నం వ‌ల్ల ఓ వ్య‌క్తి అన‌వ‌స‌రంగా జీఎస్‌టీ క‌ట్టాల్సి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే…

రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) భవన పునరుద్ధరణకు సంబంధించిన ఎంతమొత్తం ఖర్చు చేశారనే వివరాలు కోరుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్త అజయ్‌ దూబే ఆర్‌టీఐ కింద దరఖాస్తు చేసుకున్నాడు. సమాచారం ఇచ్చేందుకు అంగీకరించిన మధ్యప్రదేశ్‌ గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి బోర్డు అధికారులు సమాచారం కోసం 18 శాతం జీఎస్టీ వసూలు చేశారు. మొత్తం 18 పేజీలకు గానూ (పేజీకి రూ.2 చొప్పున) మొత్తం రూ.36 (సీజీఎస్టీ కింద రూ.3.5, ఎస్‌జీఎస్టీ కింద రూ.3.5) తీసుకున్నారు. కాగా ఈ విష‌యంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని దూబే పేర్కొన్నాడు.

ఆర్‌టీఐకి సంబంధించి ఎలాంటి జీఎస్టీ వసూలు చేయకూడదని ఈ ఏడాది జనవరిలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం సూచించింది. ఆర్‌టీఐ కింద సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి జీఎస్టీ వర్తించబోదని ఓ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర సమాచార కమిషన్‌ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ అధికారులు జీఎస్టీ వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. ఏది ఏమైనా ఇలాంటి ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉన్నంత వ‌రకు సామాన్య జ‌నాల‌కు ఇలాంటి క‌ష్టాలు త‌ప్ప‌వు..!

Read more RELATED
Recommended to you

Latest news