ఏంటి.. ఇది విన్నారా..ఒక్కో బ్రూ చిన్న ప్యాక్ 6 వేల రూపాయలట..ఇది నిజమా అందులో అంతగా ఏముంది అనే సందేహం అందరికి రావడం సహజం..అవును మీరు అలా నోర్లు వెల్లబెట్టకండి..రెండు రూపాయలు, ఐదు లేదా 10 రూపాయలు ఉన్న ఈ పాకెట్స్ 6 వేలు అంటే అందరు షాక్ అవుతున్నారు.అవి అందరు కొనే ప్యాకెట్ లు కాదు..అందులో కొకెయిన్ కూడా ఉందని తాజాగా అధికారులు తేల్చి చెప్పారు.
ఆ ప్యాకెట్స్ అన్ని చోట్లా దొరకవ్.. అందరికీ అమ్మరు. అవును ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. అక్కడ ప్యాకెట్ మాత్రమే బ్రూ కంపెనీది. లోపలున్న సరుకు కథ వేరు. బ్రూ ప్యాకెట్స్ మాటున కవరింగ్ ఇచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు ఓ ఫారెనర్. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టించింది. 56 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుని ముగ్గుర్ని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. పురానాపూల్ వద్ద కొకైన్ అమ్ముతుండగా మోరిస్ అనే ఆఫ్రీకన్ దేశస్తుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
అతడిచ్చిన సమాచారంతో కీలకమైన విషయాలు రాబట్టారు. బ్రూ కాఫీ ప్యాకెట్లలో ఎవరికి అనుమానం రాకుండానే వనస్థలిపురం, సన్ సిటీ నుండి ఈ డ్రగ్స్ సప్లయ్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో ప్యాకెట్‌లో ఒక్కో గ్రాము కొకైన్ ఉంటుంది. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి పాతవాళ్లకు ఐదు వేల రూపాయలు, కొత్త వాళ్లకు ఆరు వేలు చొప్పున గ్రామ్ కొకైన్ విక్రయిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.ఈ చీకటి దందా వెనుక అసలు రహస్యాన్ని త్వరలోనే బయట పెడతామని వారు తెలిపారు..