నిరుద్యోగ యువతకు ఎక్కడా ఉద్యోగావకాశాలు దొరక్కపోతే.. స్వయం ఉపాధి కింద మీ సేవ సెంటర్‌ను పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. సొంత వ్యాపారం ఉన్నట్లు అనిపించడంతోపాటు ఎంచక్కా ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చు. అయితే మీ సేవ సెంటర్‌ను ఎవరైనా పెట్టాలనుకుంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేమిటంటే…
* మీ సేవ సెంటర్‌ను పెట్టాలనుకునే వారు కనీసం 10వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయి ఉండాలి.
* కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ లెవల్‌లో అయినా ఉండాలి.
* మీరు ఉంటున్న ఏరియాలో మీ సేవ సెంటర్ ఉందా, లేదా అన్న విషయం తెలుసుకోవాలి. ఉంటే మీరు పెట్టబోయే మీ సేవకు అప్పటికే ఉన్న మీ సేవ సెంటర్ ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి. ఆ పరిధి 1 కిలోమీటర్ కన్నా ఎక్కువగానే ఉండాలి. అంటే 1 కిలోమీటర్ పరిధిలో ఏవైనా మీ సేవ సెంటర్‌లు ఉంటే అక్కడ మీకు మళ్లీ మీ సేవ సెంటర్ ఇవ్వరు.
ఇక మీ సేవ సెంటర్‌ను పెట్టుకునేందుకు రెండు రకాలుగా అప్లై చేయవచ్చు. ఒకటి ఆన్‌లైన్‌లో.. మరొకటి ఆఫ్‌లైన్‌లో..! ఆఫ్‌లైన్‌లో మీ సేవ సెంటర్ కోసం దరఖాస్తు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* మీ విద్యార్హతల సర్టిఫికెట్లను జిరాక్స్ తీసుకోవాలి. దగ్గర్లో ఉన్న తహసీల్దార్ లేదా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ మీ సేవ సెంటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందులో మీ పేరు, చిరునామా, విద్యార్హత, ఇతర వివరాలను తెలపాలి. మీ ఊర్లో మీ సేవ సెంటర్‌లు ఉన్నాయా, లేవా, ఉంటే ఎంత దూరంలో ఉన్నాయి.. అనే వివరాలను దరఖాస్తులో నమోదు చేయాలి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కింద మీ సేవ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని చెబుతూ దరఖాస్తులో ఆ వివరాలను తెలపాలి.
* మీ దరఖాస్తును పరిశీలించాక అధికారులు మీరు పెట్టాలనుకుంటున్న మీ సేవ సెంటర్ ఏరియా దగ్గరకు వచ్చి విచారణ చేస్తారు. మీరు ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేదోనని చూస్తారు.
ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయాలి..!
* ఏపీలో మీ సేవ అయితే https://www.aponline.gov.in/FRPTool/StatusRegistrationIndex.aspx వెబ్‌సైట్‌లోకి, తెలంగాణలో మీ సేవ సెంటర్ అయితే https://onlineap.meeseva.gov.in/CitizenPortal/UserInterface/Citizen/Registration.aspx వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
* అప్లికేషన్‌లో పేరు, విద్యార్హత, వయస్సు, విభాగం, పాన్ నంబర్ తదితర వివరాలను నింపాలి.
* సెంటర్ అడ్రస్ దగ్గర మీరు పెట్టబోయే సెంటర్ చిరునామా ఇవ్వాలి.
* రెసిడెన్షియల్ అడ్రస్ వద్ద పర్మినెంట్ అడ్రస్ వివరాలు ఇవ్వాలి
* సెంటర్ డిటెయిల్స్‌లో టైప్ ఆఫ్ బిజినెస్ వద్ద మీరు ఎక్కడ సెంటర్‌ను ప్రారంభిస్తున్నారో ఎంచుకోవాలి.
* ఓనర్‌షిప్ వద్ద సొంతంగా చేస్తున్నారా, లేదా పార్ట్‌నర్‌షిప్ ఉందా.. అన్న వివరాలను తెలపాలి.
* కనెక్షన్ టైప్ వద్ద ఇంటర్నెట్ కనెక్షన్ ఎలాంటిదో తెలపాలి
* కనెక్షన్ ప్రొవైడర్ వద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అన్నది తెలపాలి.
* ఆఫీసు స్పేస్ ఎంత ఉంటుందో చెప్పాలి.
* ఎన్ని కంప్యూటర్లను ఆఫీస్‌లో ఉంచుతారో తెలపాలి.
* కనెక్షన్ స్పీడ్ వద్ద మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలపాలి.
* మరొక మీ సేవ సెంటర్ మీ సెంటర్‌కు ఎంత దూరంలో ఉందో తెలపాలి.
పైన తెలిపినట్లుగా మీరు వివరాలను నింపి మీ సేవ సెంటర్‌కు అప్లికేషన్ పెట్టుకుంటే అధికారులు మీరు ఇచ్చిన వివరాలతో మీరు పెట్టాలనుకున్న సెంటర్ వద్దకు వచ్చి వివరాలను వెరిఫై చేస్తారు. అన్నీ సరిగ్గా ఉన్నాయనుకుంటే ప్రాసెస్ చేసి మీకు మీ సేవ సెంటర్‌ను అలాట్ చేస్తారు. ఇక ఈ విషయంలో మరికొన్ని నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది.
* మీ సేవ సెంటర్‌కు ఆఫీస్ స్పేస్ కనీసం 12 అడుగులు ఉండాలి.
* కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఇంటర్నెట్ సదుపాయాలు కచ్చితంగా ఉండాలి.
* 1 కిలోమీటర్ దూరంలో మీ సేవ సెంటర్‌లు ఉండరాదు.
* సెంటర్ పెట్టాలనుకుంటే అక్కడి జనాభా సుమారుగా 4వేల మంది ఉండాలి.
ఇక మీ సేవ సెంటర్ పెట్టాలనుకున్న వారికి ఒక ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. అందులో అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జి ఎంత ఉందో పరీక్షిస్తారు. అందులో కచ్చితంగా పాస్ అయితేనే మీ సేవ సెంటర్‌ను అలాట్ చేస్తారు. అయితే ఆ టెస్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్‌పైనే ఉంటుంది కనుక.. ఆ టెస్ట్‌లో సులభంగానే ఎవరైనా పాస్ అవ్వచ్చు. ఇక ప్రాసెస్ పూర్తయ్యాక కనీసం రూ.30వేలను చెల్లించాలి. ఈ క్రమంలో మీ సేవ సెంటర్ వచ్చాక చేసే పనిని బట్టి ఒక్కో దానికి కమిషన్ పద్ధతిలో రుసుం చెల్లిస్తారు. అలా మీ సేవ సెంటర్‌లో ఎక్కువగా సేవలు అందిస్తే నెలకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు సంపాదించవచ్చు. ఇక ప్రతి సంవత్సరం మీ సేవ సెంటర్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. కాగా మీ సేవ సెంటర్ ఏర్పాటు అప్లికేషన్‌కు ప్రాసెస్ పూర్తయితే సెంటర్ అప్రూవ్ అయ్యేందుకు వారం పడుతుంది.
సాదారణంగా మీ సేవ సెంటర్ పెట్టాలనుకుంటే ఆన్‌లైన్‌లో కన్నా ఆఫ్‌లైన్‌లోనే త్వరగా ప్రాసెస్ అవుతుందట. కనుక ఆఫ్‌లైన్‌లోనే మీ సేవ సెంటర్‌కు దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. అన్నీ సక్రమంగా జరిగితే.. మీ సేవ సెంటర్‌ను చిన్నపాటి ఆదాయ వనరుగా కూడా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే కొంత శ్రమ, పెట్టుబడి అవసరం. ఓపిగ్గా పనిచేసుకుంటే మీ సేవ సెంటర్ ద్వారా కూడా ఆకర్షణీయమైన సంపాదన ఉంటుంది..!