కులం, మతం ముసుగులో ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మంత్రి మల్లారెడ్డి, రైతు సంఘ నేత రాకేశ్ టికాయత్‌పై జరిగిన దాడులపై ఆయన స్పందించి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. కులం, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఆదివారం జరిగిన రెడ్డి సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి, బెంగళూరులో రైతు సంఘ నేత రాకేష్ టికాయత్‌పై జరిగిన దాడిని ఖండించారు.
గతంలో రాజకీయ నాయకులు తమ పేరును పక్కన పెట్టి సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే మీడియా తీరుని కూడా కేఏ పాల్ తప్పు బట్టారు. ప్రభుత్వాలు అనవసరమైన విషయాలు, ప్రజలకు పనికి రాని అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వాపోయారు. గొడవలను మీడియా చానెళ్లు లైవ్ ఇస్తున్నాయని, ప్రజలకు చూపించాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. దేశంలో ప్రశ్నించే వారిని జైలల్లో పెడుతున్నారని, బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఓ మంత్రి ప్రెస్‌మీట్ పెట్టి సవాల్ విసురుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని తేల్చి చెప్పారు.