అమరావతి: జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు, పోలీసులు, వలంటీర్లు చేస్తున్న అరాచకాల్నించి రక్షించే యాప్ ఏదైనా వుంటే ఆరంభించండి సీఎం సారూ! అంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్. కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మహిళా పోలీసుల అమానవీయ ప్రవర్తనతో సభ్యసమాజం తల దించుకుందని మండిపడ్డారు.
తన ఇంటి ముందు స్థలాన్ని పోలీసులతో వచ్చిన రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకుంటుండగా మీనాక్షమ్మ, ఆమె కుమార్తె అడ్డుపడ్డారని విమర్శించారు. సాటి మహిళలు అని కూడా చూడకుండా మహిళా పోలీసులు తమ చున్నీలతో బంధించడం అరాచకపాలనలో మరో అమానవీయ ఘటన అని నిప్పులు చెరిగారు. దుర్మార్గ ప్రభుత్వ తీరును ప్రజలంతా ఒక్కటై నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని… ఇంకెన్నాళ్లీ దౌర్జన్య పాలన ? అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.