మైదానంలో మనుషులే ఉంటారు.. ఆమె కన్నీళ్లనూ నవ్వులనూ చూసిన వాళ్లకు మనుషులు కొన్నిసార్లు ఉన్నత స్థాయిలో కొన్ని సార్లు ఏమీ కానీ రీతిలో కనిపిస్తూ ఉంటారు. ఆట కన్నా గాయాలే ఎక్కువ బాధ పెడ్తాయి. ప్రాక్టీసులో గాయాలు కన్నా జీవితంలో ఇతరుల మాటల కారణంగా వచ్చే గాయాలు ఆమెను వెన్నాడాయి. అయినా కూడా దేశానికి సేవ చేసే క్రమంలో ఇండియన్ క్రికెట్ (విమెన్) గర్వించే రీతిలో ఆమె పనిచేశారు. సమర్థత చాటారు. సమయ స్ఫూర్తి చాటారు. స్ఫూర్తిదాయక రీతిలో కెరియర్ ను కొనసాగించారు. ముగించారు కూడా !
మైదానం బయట మిథాలీ ఎప్పుడూ నవ్వులనే చిందించారు. కన్నీళ్లను అమ్మ దగ్గర మాత్రమే ప్రదర్శించి వెళ్లారు. అమ్మ తో పాటు ఇంకొందరు స్నేహితులు మిథాలీని కన్నీళ్లను తుడిచి పంపారు. జూనియర్లు కూడా ఏవేవో వాగారు. అయినా అవన్నీ మరిచిపోయి దేశం కోసం పనిచేయడంలోనే ఆమె ఓ గొప్ప ఆనందం అందుకుని ఉన్నారు. ఆమెకు ఒక్కటే తెలుసు ఆడి ఓడడం..ఆడి గెలవడం.. ఈ రెండూ మిథాలీ జీవితాన్నే కాదు ఎందరో అమ్మాయిలను ఇటుగా అనగా క్రికెట్ ప్రాక్టీసు చేసే దిశగా తీసుకువచ్చింది. విజేతలుగా మార్చింది. దటీజ్ మిథాలీ.
ఆటల్లో మిథాలీ.. మిథాలీని చూసి ఇంకొందరు. వచ్చిన వాళ్లంతా మిథాలి రికార్డులను దాటాలని కలలు కంటున్నారు. ఆమె మాత్రం ఇంకా అమ్మ చెప్పిన మాటలనే స్మరిస్తూ, ఇంకొందరి కలలను నిజం చేయాలన్న తపనతో ఉన్నారు..ఇవాళ్టికీ ! నీవు ఈ దేశం కోసం ఆడుతున్నావు అదే నిజం..మిగతావి మరిచిపో అని అమ్మ చెప్పేవారు.. ఆ మాటలే ఆమె నిజం చేశారు. ఇంకా మున్ముందు ఈ దేశానికి సేవ చేసేందుకు, క్రీడారంగాన ప్రతిభావంతులను తయారు చేసేందుకు తాను సిద్ధమేనని అంటున్నారు మిథాలి. కోచ్ గా పూర్తిగా పనిచేయాలని లేదు కానీ మెంటార్ గా మాత్రం ఉండాలనే అనుకుంటున్నాను అని అంటాన్నారామె ! నా అనుభవంతో మహిళా క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాననే అంటున్నారామె.
అమ్మాయిలు చదువులలో రాణిస్తూ ఉంటే దేశానికి వెలుగు.. ఆటల్లో రాణిస్తూ ఉంటే దేశానికి కీర్తి. ఆట పాటల్లో మెప్పిస్తూ రాణిస్తూ ఉంటే ఇంటికి వెలుగు, కుటుంబానికి ప్రతిష్ట. ఇవన్నీ మిథాలీతోనే సాధ్యం అయ్యాయి. మిథాలీ రాజ్ దేశం సత్తా చాటిన క్రికెటర్. ఇప్పుడంటే ఇన్ని అవకాశాలు కానీ విమెన్ క్రికెట్ కు ఏమీ లేని రోజుల్లో గొప్ప పేరూ, ప్రతిష్టా తీసుకువచ్చిన అమ్మాయి. టాలెంట్ తో సచిన్ దగ్గర అభినందనలు అందుకున్న హైద్రాబాదీ. ఎన్నో అవమానాలు ఉన్నా కూడా వాటిని దాటి మిథాలి మంచి గుర్తింపునే కాదు ఈ దేశంలో పెద్ద పెద్ద క్రీడాకారుల నుంచి దీవెనలు అందుకున్నారు. మిథాలీ ఇవాళ రిటైర్ కావొచ్చు కానీ ఆమె చరిత్ర సుస్థిరం.