తెలంగాణలో కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. కొత్త కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరిగింది. గత మూడు రోజులుగా వందకు పైగా రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా 200లకుపైగా కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22,662 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 219 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ లో అత్యధికంగా 164 కేసులు వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 76 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.
నేటివరకు రాష్ట్రంలో 7,94,803 కరోనా కేసులు నమోదవగా.. 7,89,433 మంది కోలుకున్నారు. కరోనా కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,259కి పెరిగింది. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111లుగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.