‘స్కేల్ ఏఐ’.. కృత్రిమ మేధస్సు (ఏఐ)కి అత్యుత్తమ కంపెనీల్లో ఇదీ ఒకటి. అమెరికా వాయుదళం, సైన్యం, జనరల్ మోటార్స్, ఎక్స్పోర్ట్లాంటి దాదాపు 300 ప్రపంచ దిగ్గజాలు ఈ సంస్థ అందించే సాంకేతిక సేవలను వాడుకుంటున్నాయి. దీని సహ వ్యవస్థాపకుడే వాంగ్. ఆరేళ్ల కిందట అంకురంగా పురుడు పోసుకున్న ‘స్కేల్ ఏఐ’ ఇప్పుడు రూ. 60 వేల కోట్ల కంపెనీగా ఎదిగింది.. ఈ ఎదుగుదలలో అలెగ్జాండర్ వాంగేది కీలకపాత్ర. వారసత్వంగా వచ్చిన ఆస్తి లేదు..తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి నేడు ఇంత స్థాయికి ఎదిగాడు. పాతికేళ్ల వయసుకో వందలకోట్లు వెనకేశాడు.. అదేంటో.. గొప్పగొప్ప వాళ్లంతా..తమ చదువును మధ్యలోనే ఆపేస్తుంటారు.. వాంగే కూడా అంతే.. కాలేజీని మధ్యలోనే మానేశాడు.
కృత్రిమ మేధస్సు, కోడింగ్‌పై అలెగ్జాండర్ పట్టు సాధించడానికి కారణం తను లెక్కల్లో ఎలాంటి చిక్కులనైనా విడగొట్టడమే..ఆరో తరగతిలో ఉండగానే ‘నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్’ విజయం సాధించాడు. పదిహేడేళ్లకే సాఫ్ట్వేర్ కోడర్ అయ్యాడు. అదే ఇష్టంతో ప్రఖ్యాత మసాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో మెషిన్ లెర్నింగ్ కోర్సులో చేరాడు. అక్కడే లూసీ గ్యూ పరిచయమైంది. తనూ టెక్నాలజీలో దిట్ట. ఇద్దరూ కలిసి శాన్ఫ్రాన్సిస్కోలో 2016లో ‘స్కేల్ ఏఐ’ ప్రారంభించారు.
ఓవైపు క్లాసులు.. మరోవైపు కంపెనీ పనులు. కొన్నాళ్లకి వాళ్లు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం వాడేలా ఒక రక్షణ ఉత్పత్తుల కంపెనీని ఒప్పించగలిగారు. ఆపై ఈ ప్రాజెక్టులోనే తలమునకలు కావడంతో ఎంఐటీ కోర్సు మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. మొదటి ప్రయత్నం విజయవంతమైంది. సంస్థని మరింత విస్తరించడానికి నిధులు కావాలి.. ఈ రంగంలో ఉన్న భవిష్యత్తు, వాళ్లపై ఉన్న నమ్మకంతో ఒక ఒక అమెరికన్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టింది. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూనే అత్యుత్తమ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
అవకాశాలు వరుస కట్టాయి. దిగ్గజ కంపెనీలూ వాంగ్ ఏఐ టెక్నాలజీ వాడుకోవడం ప్రారంభించాయి.. అంతే ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఆరేళ్లలో సంస్థ వేల కోట్లకు ఎదిగింది. ఇందులో వాంగ్ వాటా 15 శాతం. అంటే తన సంపాదన విలువ అక్షరాలా రూ.9వేల కోట్లనమాట.. ఎవరి అండదండలు లేకుండా వాంగ్ 25 ఏళ్ల వయసులోనే బిలియనీర్‌గా ఎదిగాడు.
స్టోరీ సింపుల్‌గా చెప్పేసినా..ఒక వ్యక్తి ఈ స్థాయికి రావడానికి పడిన కష్టం చాలా ఉంటుంది. సొసైటీ..గెలిచినవాడి గురించే మాట్లాడుకుంటుంది.. వాడి కష్టాలు, కన్నీళ్లు, ఒడిదొడుకులు అనవసరం.! వాంగే చిన్నతనం నుంచే చురుగ్గా ఉంటూ.. నేడు అతి పిన్న వయసులోనే కోట్లు వెనకేశాడు..! తెలివితేటలు అందరికీ ఉంటాయి.. కానీ వాటిని కొందరే మంచి పనులకు వాడతారు..!