దేశ వ్యాప్తంగా కొత్త కార్మిక చట్టం జూలై 1 నుంచి అమలు కానుంది.అందుకోసం ప్రభుత్వం సర్వం సిద్దమైనట్లు తెలుస్తుంది.మరో వైపు వాటిని అమలు చేయడానికి పలు రాష్ట్రాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి.కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ నాలుగు కొత్త కార్మిక చట్టాల ద్వారా అనేక నిబంధనలు మారనున్నాయి. కార్మికుల సామాజిక భద్రతకు వీటి ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఉద్యోగి వేతనం, పీఎఫ్ వాటా, పని గంటల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి..
ఉద్యోగి రోజుకి 12 గంటలు పనిచేసి, వారానికి మూడు రోజులు సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటివరకు ఉద్యోగి రోజుకి 8 గంటల చొప్పున వారానికి 48 గంటలు కార్యాలయాల్లో పనిచేసేవాడు. జూలై 1 నుంచి కూడా వారానికి 48 గంటలే పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, అవసరం అనుకుంటే ఆ పనిగంటలను నాలుగు రోజుల్లో పూర్తి చేసుకుని మిగతా మూడు రోజులు సెలవులు తీసుకునే అవకాశం ఉందని అధికారులు అన్నారు..
వారానికి 48 గంటల కంటే ఎక్కువగా పనిచేసే ఉద్యోగికి కార్యాలయాలు ఓవర్ టైమ్ రెండు రెట్లు ఇవ్వాలి. కొత్త కార్మిక చట్టాల ద్వారా మారే మరో కీలక అంశం చేతికి అందే వేతనం. ఉద్యోగ భవిష్యనిధి వాటా, వేతనం నిష్పత్తి మధ్య భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉద్యోగి స్థూల వేతనంలో అతడి మూల వేతనం 50 శాతం ఉండాలి. దీంతో ఉద్యోగి పీఎఫ్ వాటా పెరిగి, అతడికి చేతికి అందే వేతనం తగ్గనుంది..తర్వాత అతను రిటైర్డ్ అయినప్పుడు ఆ డబ్బులు మొత్తం అతనికి లభిస్తుంది..ఈ విషయం పై ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి వున్నట్లు తెలుస్తుంది.