5జి టెలి సర్వీసెస్ కోసం మెగా స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే అపరకుబేరుడు గౌతం ఆదానికి చెందిన ఆదానీ గ్రూప్, టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరుగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు ఆధానీ గ్రూపు దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్ధారిస్తుందని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.
4 జి కంటే పది రెట్ల వేగంతో డేటా బదిలీకి వీలున్న, వినూత్న సేవలను అందించేందుకు స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ఐడియా తో పాటు ఆదాని గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై ఆధానీ గ్రూప్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ నెల 12న అధికారిక వివరాలు వెల్లడవుతాయి. అయితే గుజరాత్ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ తో అదే రాష్ట్రనికి చెందిన గౌతమ్ ఆడానీ ఇప్పటివరకు ఏ వ్యాపారంలో నేరుగా తలపడిన సందర్భాలు లేవు. ఇప్పుడు టెలికాం రంగంలో గౌతమ్ ఆదాని అడుగుపెడితే ఇద్దరు కుభేరుల మధ్య పోటీ తీవ్రం కానుంది.