వలంటీర్ల వ్యవస్థ ఒక మాఫియా వ్యవస్థగా మారే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను బెదిరించే పరిస్థితి మంచి విధానం కాదని.. ప్రభుత్వం బాగా పని చేస్తుంటే 480 అర్జీలు రావు కదా..? అని నిలదీశారు. మణికంఠ అనే దివ్యాంగుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే పెన్షన్ ఆపేశారని.. అమరావతి నుంచి రైతులకు కౌలు డబ్బులు పడలేదని చెప్పినా పాలకులు స్పందించ లేదని ఆగ్రహించారు.
జనవాణి ద్వారా అర్జీలు ఇచ్చేందుకు చాలా దూరం నుంచి ప్రజలు వచ్చారని.. గంటల తరబడి నిరీక్షించి తమ ఆవేదన వెలిబుచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా తమ బాధ్యతలు విస్మరించిందని.. ఓటేయించుకునే సమయంలో కూడా కులాల ప్రాతిపదికన మనుషులు చీలుస్తారని హెచ్చరించారు.
రౌడీయిజం చేసే రాజకీయ నాయకులు అంటే నాకు చాలా చిరాకు అని.. వంగవీటి మోహనరంగా పేరు నేటికీ వినిపిస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రంగా అని.. నేటికీ రంగాని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. వైసీపీ ఆగడాలు శృతి మించి పోతున్నాయి… టిడ్కో ఇళ్లు ఇవ్వరు, ఉన్న ఇళ్లనే లాక్కుంటున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, పధకాలు రద్దు అంటున్నారని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్.