ఎడతెరిపి లేకుండా గత ఆరు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి కట్టలు తెగిపోయి వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే… భారీ వర్షాల కారణంగా.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భారీగా వరద వస్తుండటంతో ఉదయం 7 గంటలకు 51.20 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టిన గోదావరితో వరద మళ్లీ పెరిగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రస్తుతం 13,31,102 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా… గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇదిలా ఉంటే.. భారీగా వరద పోటెత్తడంతో రామాలయం పడమరమెట్ల వద్ద నీరుచేరింది. ఆలయ దుకాణాలు వరద నీటిలో మునిగాయి. అన్నదాన సత్రంలోకి వరద నీరుచేరడంతో భక్తులకు అన్నదానం నిలిపివేశారు అధికారులు. ఇక భద్రాచలంలోని కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ ప్రాంతాల్లో వరద ప్రవహిస్తుండడంతో అధికారులు కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అంతేకాకుండా పరిసర గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.