ఈ సారి కూడా రాష్ట్రంలో మద్యం దుకాణాలు మళ్లీ ప్రైవేటుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్థం చేస్తోంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటుపరం చేసి మరింత ఆదాయం రాబట్టుకోవాలని ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గత ఆర్థిక సంవత్సరంలో 25 వేల కోట్ల విలువైన మద్యం విక్రయించి.. దాదాపు 20 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది రాష్ట్ర ప్రభుత్వం. మద్యం వ్యాపార పరిమాణం ఇంకా చాలా ఎక్కువగా ఉన్నా.. సరిగ్గా రాబట్టలేకపోతున్నామనే భావన ఎక్సైజ్ వర్గాల్లో ఉంది. దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తే కమీషన్ సొమ్ము కోసం వివిధ మార్గాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నారు.
పూర్తిగా వృత్తి నైపుణ్యంతో వ్యాపారం చేస్తారని, బీర్ల చల్లదనం కోసం కూలర్ల ఏర్పాటు, అవసరమైన ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోగలరని, పర్మిట్లు రూమ్‌ల వంటివి వస్తాయని.. వీటన్నింటి వల్ల మద్యం మరింత ఎక్కువగా అమ్ముడవుతుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నెలకు 19 వందల కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. అదే ప్రైవేటుకు దుకాణాలు అప్పగిస్తే నెలకు కనీసం 3 వేల కోట్ల విలువైన మద్యం అమ్మొచ్చనేది అబ్కారీ శాఖ అంచనా.