తెలంగాణలో గత వారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. అంతేకాకుండా చెరువులు నిండి మత్తడి పోసాయి. ఎగువ రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురియడంతో జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో తెలంగాణలోని జలాశయాలు నిండుకుండాల్లా మారాయి. అంతేకాకుండా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు తీవ్ర పంట నష్టాన్ని చవి చూశారు. అయితే.. తెలంగాణలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి తణక్షమే ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని సంబంధిత అధికారులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.
మంగళవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్‌తో కలిసి బండి సంజయ్ కేంద్ర మంత్రిని కలిశారు. వరదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, జరిగిన నష్టాన్ని అమిత్ షాకు వివరించామని, దాంతో ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని అధికారులను ఆదేశించారని ఓ ప్రకటనలో తెలిపారు బండి సంజయ్. త్వరలో ఉన్నత స్థాయి బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందజేస్తాయని పేర్కొన్నారు బండి సంజయ్.