మా డబ్బు తీసుకుని మాకే ఇస్తున్నారు : మంత్రి బుగ్గనను నిలదీసిన మహిళ

-

‘’వంట నూనెల ధరలను పెంచారు. చెత్త పన్ను వేస్తున్నారు. మా డబ్బు తీసుకుని మాకే ఇస్తున్నారు. మీరేమి ఇచ్చారు’’ అంటూ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని మాధవి అనే మహిళ నిలదీశారు. ఆదివారం సాయంత్రం మంత్రి బుగ్గన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలోని 30, 31వ వార్డుల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా 31వ వార్డులోని కొత్తపేటలోని కంబాలపాడు రహదారి పక్కనున్న వీధిలో పలువురు మహిళలు మంత్రి బుగ్గనను ప్రశ్నించారు. ‘తమకు టైలర్ల సాయం కింద డబ్బు వస్తుందంటే దరఖాస్తు చేయగా మంజూరైందని, డబ్బు పడకపోతే ఎలా’ అని మాధవి ప్రశ్నించారు. తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు వస్తాయని నమ్మి జగనన్నకు మూడు ఓట్లు వేశామన్నారు.

దీనిపై మంత్రి బుగ్గన స్పందిస్తూ… ‘‘మీ కుటుంబానికి రూ.98,140 పడ్డాయి కదమ్మా.. ఇంకా రాలేదని ఎలా చెబుతావమ్మా’’ అని పేర్కొన్నారు. అయితే ‘రూ.లక్ష ఇచ్చి.. రూ.2 లక్షలు లాగుతున్నారని’ ఆమె ఆరోపించారు. టైలర్ల సాయం కింద ఆమెకు డబ్బు పడిందని, బ్యాంకు ఖాతాలో చూసుకోలేదని సచివాలయం సిబ్బంది చెప్పారు.

అదే వీధిలో గీతారాణి అనే మహిళ మాట్లాడుతూ… ‘నా ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. వారిలో ఒకరికి అమ్మ ఒడి కింద డబ్బు పడలేదు. సచివాలయం వద్దకు వెళ్తే మాకు 10 ఎకరాల భూమి ఉన్నట్లు చూపుతోందని చెబుతున్నారు. మాకు అసలు భూమే లేదు. మాకు ఒక్క పథకమూ అందడం లేదు. మా పేరు మీద ఉన్న భూమిని మాకు ఇప్పించండి’ అని మంత్రి బుగ్గనను అడిగారు. మరికొందరు పింఛన్లు రాలేదని, వాటిని మంజూరు చేయించాలని’ మంత్రి బుగ్గన దృష్టికి తీసుకువచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news