అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాదీ ఒక్క రూపాయి వేతనం కూడా తీసుకోలేదు. ఈ మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆయన వేతనాన్ని ‘సున్నా’ చూపిస్తూ రిలయన్స్ తన వార్షిక నివేదిక విడుదల చేసింది. కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో వార్షిక వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు అంబానీ 2021-22లో ప్రకటించారు. దాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరానికీ కొనసాగించారు.
ఈ రెండు సంవత్సరాల్లో అంబానీ ఎటువంటి అలవెన్సులు, ముందస్తు ఖర్చులు, రిటైర్‌మెంట్ ప్రయోజనాలు, కమీషన్లు, స్టాక్ ఆప్షన్లను పొందలేదు. చివరిసారి ఆయన 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.15కోట్ల వేతనం అందుకున్నారు. 12ఏళ్లుగా ఆయన జీతంలో ఎలాంటి మార్పు లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ హోదాలో 2008-09 నుంచి జీతం, భత్యాలు, కమీషన్ అన్నీ కలిపి ఏడాదికి రూ.15 కోట్లే తీసుకుంటున్నారు. ఏటా దాదాపు రూ.24 కోట్లను వదులుకుంటున్నారు.
కాగా.. అంబానీ బంధువులు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నిఖిల్, హితల్ మెస్వానీ వేతనాల్లో ఎలాంటి మార్పు లేదు. వీరు గతేడాదికి గానూ రూ. 24 కోట్ల జీతం అందుకున్నారు. ఇందులో రూ. 17.28 కోట్లు కమిషన్ కింద పొందారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ రూ.11.89 కోట్లు అందుకున్నారు. క్రితం ఏడాది తీసుకున్న రూ.11.99 కోట్లతో పోలిస్తే ఇది కాస్త తక్కువ.
మరో ఈడీ పవన్ కుమార్ కపిల్ వేతనం రూ.4.24 కోట్ల నుంచి రూ.4.22 కోట్లకు తగ్గింది. వీరివురి వేతనాల్లో పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కూడా కలిపి ఉన్నాయి. కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ముకేశ్ సతీమణి నీతా అంబానీ గత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. ఐదు లక్షల సిట్టింగ్ ఫీజు, రూ.2 కోట్ల కమీషన్ అందుకున్నారు.