ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంపాక్ట్ ఫీజు పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది. నగరాలు, పట్టణాలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న రహదారుల పక్కన కొత్తగా భవనాలు నిర్మించే వారు ఈ ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర చార్జీలకు అదనంగా ఇకపై ‘ఇంపాక్ట్ ఫీజు’ను కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పురపాలక శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న రహదారులతోపాటు నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా రహదారుల నిర్మాణానికి భూసేకరణ దశలో ఉన్న చోట కూడా ఫీజు కట్టాల్సిందేనని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర చార్జీలకు అదనంగా దీన్ని చెల్లించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. 60 అడుగులు, ఆపైన.. 150 అడుగులు వెడల్పున్న రహదారుల్ని ఆనుకుని నిర్మించే పారిశ్రామికేతర
వాణిజ్య భవనాలకూ ఇది వర్తిస్తుందని వివరించింది.
అంతేకాదు, 150 అడుగులు, అంతకుమించి వెడల్పు ఉన్న రహదారులకు రెండు పక్కలా 250 మీటర్ల దూరం వరకు నిర్మించే అన్ని రకాల భవనాలకు ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా బిల్డప్ ఏరియాలో ప్రతీ చదరపు అడుగుకు ఇంత మొత్తమని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిని అక్కడి స్థలం రిజిస్ట్రేషన్ విలువలో రెండు నుంచి మూడుశాతం కానీ, ఈ రెండింటిలో ఏది ఎక్కైవైతే దానిని వసూలు చేస్తారు. ఉదాహరణకు.. నగర పాలక సంస్థల పరిధిలో రెండువేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో వాణిజ్య భవనాన్ని 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న స్థలంలో నిర్మిస్తే కనుక చదరపు అడుగుకు రూ. 100 చొప్పున రూ. 2 లక్షలను ఇంపాక్ట్ ఫీజుగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇంపాక్ట్ ఫీజును రోడ్ల విస్తరణ, లింక్ రోడ్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్ల నిర్మాణం వంటి వాటికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.