రైలు టిక్కెట్‌పై స‌బ్సిడీ.. మీరు వ‌దులుకుంటారా..?

-

ఇక‌పై రైలు టిక్కెట్ల‌ను బుక్ చేసేట‌ప్పుడు మ‌న‌కు రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఒక‌టి స‌బ్సిడీతో, మ‌రొక‌టి స‌బ్సిడీ లేకుండా. స‌బ్సిడీని ఎంచుకుంటే మ‌న‌కు టిక్కెట్ ధ‌ర త‌క్కువ ప‌డుతుంది.

వంట గ్యాస్ కొన‌లేని పేద‌ల‌కు గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా అందించేందుకు గాను గ‌తంలో ప్ర‌ధాని మోదీ గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకోవాల‌ని పిలుపునిస్తూ గివ్ ఇట్ అప్ స్కీంను ప్రారంభించిన విష‌యం విదిత‌మే. ఆ స్కీంకు విశేష రీతిలో స్పంద‌న ల‌భించింది. పెద్ద ఎత్తున చాలా మంది ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన వారు, సంప‌న్నులు, సెల‌బ్రిటీలు వంట గ్యాస్ స‌బ్సిడీని స్వ‌చ్ఛందంగా వ‌దులుకున్నారు. అయితే ఇక‌పై ఇదే త‌ర‌హా గివ్ ఇట్ అప్ స్కీంను రైలు టిక్కెట్ల విష‌యంలోనూ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

సాధార‌ణంగా రైళ్ల‌లో ప్ర‌యాణించే ప‌లు వ‌ర్గాలకు చెందిన వారికి రైల్వే డిస్కౌంట్ ఇస్తుంటుంది. ఆర్మీ, వృద్ధులు, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు, రైళ్ల‌లో ప‌నిచేసేవారు, విద్యార్థులు, మ‌హిళ‌లు, విక‌లాంగులు.. ఇలా ర‌క ర‌కాల వ‌ర్గాల‌కు చెందిన వారికి దాదాపుగా 100 శాతం వ‌ర‌కు రైల్వే టిక్కెట్ల‌పై రాయితీ ల‌భిస్తుంది. అయితే ఏ రాయితీ లేకుండా రైల్వే టిక్కెట్‌ను అస‌లు రేటుకే కొన్నా.. నిజానికి దానిపై కూడా మ‌న‌కు 50 శాతం స‌బ్సిడీ వ‌స్తుంది. అంటే మ‌నం రాయితీ లేకుండా రూ.100 పెట్టి టిక్కెట్ కొంటే.. దాని అస‌లు రేటు రూ.200 ఉంటుంద‌న్న‌మాట‌. అంటే.. మ‌న‌కు స‌గం స‌బ్సిడీ వ‌స్తుంది. అయితే ఇలాంటి స‌బ్సిడీల వ‌ల్ల ఏటా రైల్వేకు సుమారుగా రూ.35వేల కోట్ల న‌ష్టం వస్తుంద‌ట‌. అందువ‌ల్ల ఇక‌పై ఈ స‌బ్సిడీని కూడా స్వ‌చ్ఛందంగా ఉప‌సంహరించుకునేలా రైల్వే గివ్ ఇట్ అప్ పేరిట ఓ కొత్త స్కీంను అందుబాటులోకి తేనుంది.

ఇక‌పై రైలు టిక్కెట్ల‌ను బుక్ చేసేట‌ప్పుడు మ‌న‌కు రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఒక‌టి స‌బ్సిడీతో, మ‌రొక‌టి స‌బ్సిడీ లేకుండా. స‌బ్సిడీని ఎంచుకుంటే మ‌న‌కు టిక్కెట్ ధ‌ర త‌క్కువ ప‌డుతుంది. అదే స‌బ్సిడీ లేకుండా అనే ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే మ‌నం అస‌లు ధ‌ర‌కే టిక్కెట్‌ను కొనాలి. అది కొంచెం ఎక్కువ ఉంటుంది. దీంతో సంప‌న్నులు త‌మ స‌బ్సిడీని వ‌దులుకుంటార‌ని రైల్వే యోచ‌న‌. అందువ‌ల్ల త‌మ‌కు క‌లిగే న‌ష్టాన్ని కొంత వ‌ర‌కైనా పూడ్చుకోవ‌చ్చ‌ని రైల్వే భావిస్తోంది. మ‌రి ఈ స్కీం అందుబాటులోకి వ‌స్తే ఎంత‌మంది రైలు టిక్కెట్ల‌పై స‌బ్సిడీని వ‌దులుకుంటారో.. వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news