ఈ నెల 22వ తేదీన తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడం ప్రారంభమవుతుందని చెప్పారు.
జూన్ నెల ముగుస్తున్నా.. దేశంలో ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు రుతు పవనాల రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వాటి రాక మరింత ఆలస్యం అవుతుండడంతో వేసవి అలాగే కొనసాగుతోంది. దీంతో ఆ తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఎండలతో అవస్థలు పడుతున్న తెలంగాణ ప్రజలకు మాత్రం వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఎల్లుండి రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ నెల 22వ తేదీన తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడం ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే శని, ఆది వారాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా రుతుపవనాలు ఈ నెల మొదటి వారంలో కేరళను తాకినప్పటికీ అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను కారణంగా రుతుపవనాల రాక ఆలస్యం అయింది.
అయినప్పటికీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం కారణంగా వాతావరణంలో తేమ శాతం పెరగడంతో రుతు పవనాల రాకకు మార్గం సుగమం అయిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 2-3 రోజుల్లో కర్ణాటకతోపాటు, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా జూలై నెలలో అల్ప పీడనాలు బాగా ఏర్పడుతాయని అందువల్ల ఆ నెలలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. ఎండలతో అల్లాడిపోయిన జనాలకు మరో రెండు రోజుల్లో వర్షాలు చల్లదనాన్ని అందించనున్నాయన్నమాట..!