దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుకలు నిర్వహిస్తోంది. అయితే.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా ఈ నెల 21న చేపట్టిన ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వాములవ్వాలని కోరారు ఇంద్రకరణ్ రెడ్డి.
ప్రపంచంలో వినూత్నంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫాలితాలనిస్తున్నదని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గ్రీనరీ 7.7శాతం పెరిగిందని, కోట్లాది మొక్కలు నాటిన ఫలితంగా పర్యావరణం కూడా పరిరక్షించబడి వర్షాలు సమయానుకూలంగా బాగా కురుస్తున్నాయని తెలిపారు ఇంద్రకరణ్ రెడ్డి.ఈ నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుకలు రావడం, ఈ అద్భుత అవకాశాన్ని తీసుకుని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, వాటిని సంరక్షించాలని కోరారు ఇంద్రకరణ్ రెడ్డి. ఇందుకు తగ్గట్లుగా జిల్లా కలెక్టర్లు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.