అత్యున్నత వేదికపై అద్భుత ఆటతీరుతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఈ కేరళ ఆటగాడు సంచలన విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2018, 2019 ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కెంటో మోమేటా (జపాన్) పై ప్రణయ్ వరుస గేముల్లో గెలిచి ఈ మెగా ఈవెంట్ లో వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 18 వ ర్యాంకర్ ప్రణయ్ 21-17, 21 – 16 తో కెంటో మోమేటా ను ఓడించాడు. గతంలో మోమేటాతో ఆడిన ఏడుసార్లు ఓడిపోయిన ప్రణయ్ ఎనిమిదో ప్రయత్నంలో విజయం సాధించడం విశేషం.
మోమేటాతో 54 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో ప్రణయ్ కీలక దశలో ఒత్తిడికి లోను కాకుండా సంయమనం తో ఆడి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ 4-4 తో సమంగా నిలిచారు. ఆ తర్వాత ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 6-4 తో ఆదిక్యంలోకి వెళ్ళాడు. అనంతరం ఒక పాయింట్ కోల్పోయిన ప్రణయ్ మళ్లీ విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10 – 5 తో ముందంజ వేశాడు. ।ఇదే దూకుడును కొనసాగిస్తూ ప్రణయ్ తొలి గేమ్ ను సొంతం చేసుకున్నాడు.