ఓ అల్పజీవి ప్రాణం – వారికి ఎంతో విలువైంది..!

-

ఓ చిన్న జీవి ప్రాణం రక్షించడానికి అక్కడ ఎంతో మంది శ్రమించారు. ప్రజలు ఓపిగ్గా నిరీక్షించారు. ఒక చిరుజీవి ఊపిరి కాపాడటం ద్వారా అసలు మానవత్వం అంటే ఏంటో నిరూపించారు. మానవజన్మ పరమార్థం ఏంటో ప్రపంచానికి తెలియపరిచారు.

24 జూన్‌ 2019. అది జర్మనీలోని డార్ట్‌మండ్‌ నగరం. సరిగ్గా రెండు రోజుల క్రితం. అసలే ఆఫీసు వేళ. రోడ్డంతా బిజీగా ఉంది. రోడ్డుకు అంచున ఒక మ్యాన్‌హోల్‌ ఉంది. ఆ మ్యాన్‌హోల్‌కు ఉండే రంధ్రాలలో ఒక దాన్లో ఉడుత తల ఇరుక్కుంది. లోపలి కాలువనుండి ఇలా బయటపడదాం అనుకున్నదో ఏమో, రంధ్రం కనబడగానే అందులో తలదూర్చి బయటికి రాబోయింది. తల బయటపడింది కానీ, శరీరం మొత్తం రావడంలేదు. సరే, చేసేదేముంది, ఇహ వెనక్కి వెళదాం అనుకుని తలను వెనుకకు లాక్కోవడానికి ప్రయత్నించింది కానీ, రావడంలేదు. దవడ ఎముకలకు మ్యాన్‌హోల్‌ అంచులు అడ్డం వచ్చేశాయి. అంతే, ఇక బయటకు రాలేక, వెనుకకు వెళ్లలేక ఆ ఉడుత నానా యాతనలు పడుతోంది. ఏదైనా వాహనం అటువైపే వస్తే, ఇంతే సంగతులు.

ఇలాంటి పరిస్థితుల్లో, దాని అవస్థను గమనించిన ఒక అబ్బాయి, జంతు సంరక్షణ కేంద్రానికి సమాచారమిచ్చాడు. హుటాహుటిన ఆ కేంద్రంవాళ్లు సంఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారమివ్వగా, పోలీసులు కూడా చేరుకున్నారు. ఇక ఉడుతను రక్షించే కార్యక్రమం మొదలైంది. పోలీసులు అటువైపుగా ప్రయాణిస్తున్న వాహనాలను ముందు చౌరస్తాలోనే దారి మళ్లించారు. వెటర్నరీ వాళ్లు అక్కడే ఉడుతను బయటికి తీయడానికి ప్రయత్నించారు కానీ, ఫలితం దక్కలేదు. వీరి ప్రయత్నం వల్ల దానికి నొప్పి కలుగుతుండటంతో అది బాధగా అరుస్తోంది. ఇక చేసేదేమీ లేక, మొత్తం మ్యాన్‌హోల్‌ కవర్‌నే జంతుసంరక్షక కేంద్రానికి తరలించారు. ఆ ఇనుప కవర్‌ను కట్‌ చేస్తే కానీ, దాన్ని బయటకుతీసే పరిస్థితి లేదు. ముట్టుకుంటేనే ఆది కుయ్యోంటోంది. దాంతో ఉడుతకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి, కవర్‌ను కట్‌ చేసి బయటకు తీసారు. గంటల తరబడి ఆ రంధ్రంలో వేలాడుతూ ఉండటం వల్ల ఉడుత అలసిపోయి, శక్తి కోల్పోయిఉంటుందని కొంచెంసేపు సెలైన్‌ పెట్టి, తిరిగి ఉత్సాహవంతురాలిగా తయారుచేసి చెట్లవైపు వదిలేసారు.

కట్‌ చేసిన మ్యాన్‌హోల్‌ కవర్‌ను తిరిగి వెల్డింగ్‌ చేసి అతికించి, అదే మ్యాన్‌హోల్‌పై అమర్చారు. ఇదంతా జరుగుతున్నంత సేపు ఒక పోలీస్‌ మ్యానహోల్‌ వద్ద కాపలాగా ఉన్నాడు. అటువైపు ఎవరైనా వచ్చి, అందులో పడతారేమోనని. జరుగుతున్న ప్రయత్నానికి హర్షం వ్యక్తం చేసిన ప్రయాణీకులు కూడా ఆ కాసేపు వేరే దారిలో వెళ్లారు.

చదవడానికి, వినడానికి ఎంత బాగుంది? ఆ రెస్క్యూ అపరేషన్‌లో పాల్గొన్నవాళ్లు, పోలీసులు, ప్రజలు ఎంత సంతోషించిఉంటారు? ఒక ప్రాణం కాపాడిన తృప్తితో ప్రపంచంలో ఏదీ సమానం కాలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news