దిల్లీ అసెంబ్లీలో అర్ధరాత్రి హైడ్రామా.. బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేల నిరసన

-

దిల్లీ అసెంబ్లీలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఆప్, బీజేపీల మధ్య రాజకీయ విభేదాలు రోజురోజుకి మరింత ముదురుతున్నాయి. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాపై ఆరోపణలు చేసిన ఆప్.. వాటిపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా రాత్రిపూట అసెంబ్లీలో నిరసనకు దిగారు. ఆప్ నిరసనకు కౌంటర్‌గా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఆందోళన చేయడంతో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది.

బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం శాసనసభలో సొంత ప్రభుత్వంపైనే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాపై ఆప్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 2016లో జరిగిన నోట్ల రద్దు సమయంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న సక్సేనా.. తన ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి రూ.1400 కోట్ల విలువైన పాత నోట్లను మార్పిడి చేయించారని ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఆప్‌ ఎమ్మెల్యేలు రాత్రంతా శాసనసభ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు.

అన్నట్లుగానే నిన్న రాత్రి నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆప్‌ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేతబట్టి ఆందోళనకు దిగారు. ఎల్‌జీ సక్సేనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాత్రి అసెంబ్లీ ప్రాంగణంలోనే ఎమ్మెల్యేలు నిద్రించారు.

కాసేపటికే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరి నిరసనలు చేపట్టారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వంలోని మంత్రులు మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్‌ అవినీతికి పాల్పడ్డారని, వారిని వెంటనే మంత్రి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలోని భగత్‌సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్‌ విగ్రహాల వద్ద ఆందోళన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news