తెలంగాణ పండుగలంటేనే.. ఎక్కువగా అందులో ప్రకృతిని ఆరాధించడం మనకు కనిపిస్తుంది. బతుకమ్మ, బోనాల పండుగలే అందుకు ఉదాహరణలు.
ఆషాఢ మాసం వస్తుందంటే చాలు.. తెలంగాణలోని నగరాలు, పట్టణాలు.. పల్లెలు అమ్మవారి బోనాల కోసం ముస్తాబవుతుంటాయి. ఎక్కడ చూసినా ఆలయాల్లో బోనాల శోభ కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు మహిళలు అమ్మవారికి బోనాల మొక్కులను సమర్పించేందుకు సిద్ధమవుతుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా మరోసారి బోనాల ఉత్సవాలకు రాష్ట్రం సిద్ధమవుతోంది. ముఖ్యంగా జంట నగరాల్లో పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
తెలంగాణ పండుగలంటేనే.. ఎక్కువగా అందులో ప్రకృతిని ఆరాధించడం మనకు కనిపిస్తుంది. బతుకమ్మ, బోనాల పండుగలే అందుకు ఉదాహరణలు. ప్రకృతిలో దొరికే పూలు, ఆకులతో బతుకమ్మలను తీర్చిదిద్దితే.. ప్రకృతి అందించే కాయగూరలను, ఆకుకూరలను వేసి బోనాలను వండి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే పచ్చని ఆకులతో చేసిన తోరణాలు మనకు అమ్మవారి ఆలయాల్లో కనిపిస్తాయి. బోనాలకు కూడా వాటిని అలంకరిస్తారు. ఇలా తెలంగాణ పండుగల్లో మనకు ఎక్కడ చూసినా ప్రకృతి మమేకమై మనకు కనిపిస్తుంది.
ఆషాఢ మాసంలో సహజంగానే వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. ఈ కాలంలో వ్యాధులు కూడా ఎక్కువగా ప్రబలుతుంటాయి. అందుకనే వాటి నుంచి తమను కాపాడాలని కోరుతూ భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. ఇక శాస్త్రీయ పరంగా కూడా బోనాల వల్ల మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బోనాల్లో ఉపయోగించే పసుపు, వేపాకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ కాలంలో వచ్చే అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
ఆధ్యాత్మిక పరంగానూ బోనాల పండుగను నిర్వహించేందుకు కారణం ఉంది. అదేమిటంటే… ఆషాఢ మాసంలో దేవి (అమ్మవారు) తన పుట్టింటికి వెళ్తుందట. అందువల్ల పుట్టింటికి వచ్చే ఆడపిల్లకు మనం ఎలాగైతే మర్యాదలు చేసి.. విందులు, వినోదాలు చేస్తామో.. అలాగే అమ్మవారికి ఈ సమయంలో బోనాలు సమర్పించి, ఆమెకు మొక్కులు చెల్లించి, నైవేద్యాలు పెడితే.. అమ్మవారు మనల్ని చల్లగా చూస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక కొందరు భక్తులు తాము కోరుకునే కోర్కెలు నెరవేరాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ భక్తితో బోనాలు సమర్పిస్తారు. అలాగే బోనాల అనంతరం మాంసాహారంతో విందులు, వినోదాలు చేసుకుని ఆనందంగా గడుపుతారు. ఇలా బోనాలతో మొక్కుకోవడం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని కూడా నమ్మి అనేక మంది బోనాల ఉత్సవాల్లో అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. ఇవీ.. బోనాల ఉత్సవాలను నిర్వహించడం వెనుక ఉన్న ప్రధాన కారణాలు..!