రంగంతో ముగిసే బోనాల ఉత్సవం.. ఆద్యంతం.. అద్భుతం..!

-

ఘటం రూపంలో అమ్మవారి ఊరేగింపు జరిగే సమయంలో భక్తులకు, ఘటానికి పోతురాజులు రక్షణగా ఉంటారు. సాధారణంగా పోతురాజులుగా ఉండేవారు అమితమైన బలశాలులుగా ఉంటారు. వారు ఒంటికి పసుపు రాసుకుంటారు. నుదుటిపై పెద్ద సైజులో కుంకుమ బొట్టు ధరిస్తారు.

రెండు రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాల్లో మొదటి రోజంతా అమ్మవారికి బోనాల మొక్కులను చెల్లించడం, విందులు, వినోదాల్లో పాల్గొనడంతో పూర్తవుతుంది. దీంతో ముఖ్యమైన ఘట్టానికి తెరలేస్తుంది. అదే రంగం.. అయితే రెండో రోజు కూడా మొదటి రోజు లాగే బోనాల ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతాయి. మొదట అమ్మవారి ఘటం ఊరేగింపు ఉంటుంది. అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన ఓ రాగి కలశాన్ని ఘటం అని అంటారు. సాంప్రదాయ వస్ర్తాలను ధరించి, ఒంటికి పసుపు రాసుకున్న ఓ పూజారి ఘటాన్ని మోస్తాడు.

ఇక అమ్మవారి ఘటాన్ని ఊరేగించే కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా సాగుతుంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతుంది. ఘటంతోపాటు భక్తులు ఊరేగింపులో పాల్గొంటారు. ఈ క్రమంలో ఘటానికి (అమ్మవారికి) అడుగడుగునా భక్తులు నీరాజనాలు సమర్పిస్తారు. తమను చల్లగా చూడమని వేడుకుంటారు. మొదటి రోజు బోనాల ఉత్సవాల్లో పాల్గొనని భక్తులు రెండో రోజు ఘటం ఊరేగింపును చూస్తారు. దీంతోనైనా అమ్మవారి కృపను భక్తులు పొందవచ్చని విశ్వసిస్తారు.

ఘటం రూపంలో అమ్మవారి ఊరేగింపు జరిగే సమయంలో భక్తులకు, ఘటానికి పోతురాజులు రక్షణగా ఉంటారు. సాధారణంగా పోతురాజులుగా ఉండేవారు అమితమైన బలశాలులుగా ఉంటారు. వారు ఒంటికి పసుపు రాసుకుంటారు. నుదుటిపై పెద్ద సైజులో కుంకుమ బొట్టు ధరిస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టుకుని పారవశ్యంలో నృత్యాలు చేస్తారు. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా కాలు కదుపుతూ నృత్యాల నడుమ అమ్మవారిని ఊరేగిస్తారు.

ఇక ఘటం ఊరేగింపు అయ్యాక చాలా మంది ఫలహారం బండ్లను కూడా ఊరేగిస్తారు. పులిహోర, తీపి వంటకాలు, మిఠాయిలు, ప్రసాదంలను ఒక బండిలో వేసుకుని నృత్యాల నడుమ దాన్ని ఊరేగిస్తూ అందులో ఉన్న ప్రసాదాలను, వంటకాలను భక్తులకు పంచి పెడతారు. ఇలా అమ్మవారి ప్రసాదాన్ని పంచడం ద్వారా పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక చివరిగా రంగం కార్యక్రమం ఉంటుంది.

రంగంలో భాగంగా పోతురాజు వేషం వేసుకున్న వ్యక్తికి పూనకం వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మహిళలు కూడా రంగంలో ఉంటారు. వారి ఒంటి మీదకు అమ్మవారు పూనుతుంది. ఆ సందర్భంలో భక్తులు తమకు ఉండే సందేహాలను రంగం వచ్చిన వారిని అడిగి తెలుసుకుంటారు. ఇక ఆ వ్యక్తి ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడంతోపాటు మరుసటి ఏడాది అమ్మవారికి ఉత్సవాలను ఎలా నిర్వహించాలో కూడా చెబుతారు. దీంతో రెండో రోజు ఉత్సవాలతోపాటు పూర్తిగా బోనాల వేడుకలు ముగుస్తాయి. కాగా బోనాల ఉత్సవాల రోజున వర్షం పడితే.. ప్రజలు తమను అమ్మవారు ఆశీర్వదించినట్లు భావిస్తారు. అదే చాలా ఏళ్ల నుంచీ ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున వర్షం పడితే ఇక సంవత్సరం మొత్తం తమకు ఎలాంటి ఢోకా ఉండదని, రైతులు సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చని అందరూ నమ్ముతారు..!

Read more RELATED
Recommended to you

Latest news