మరో మూడ్రోజుల పాటు తెలంగాణ ప్రజలకు వర్షాలతో తిప్పలు తప్పవు. రాగల మూడ్రోజులు కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు, రేపు అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అదే ప్రదేశంలో కొనసాగుతుందన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉందన్నారు. కావున ఇది రానున్న 24గంటల్లో వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలోని వాయువ్య దిశగా ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి చేరుకునే అవకాశం ఉందని సంచాలకులు వివరించారు.