కృష్ణం రాజును ‘రెబల్ స్టార్’గా మార్చిన సినిమా ఏంటో తెలుసా?

-

పౌరాణికాలు మొదలుకొని అన్ని రకాల నేపథ్య చిత్రాల్లోనూ కృష్ణంరాజు నటించారు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే ఆయన 180కి పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ‘చిలకా గోరింక’తో 1966లో తెరంగేట్రం చేసిన కృష్ణంరాజు.. 1978లో వచ్చిన ‘కటకటాల రుద్రయ్య’ సినిమాతో రెబల్‌ స్టార్‌గా మారారు.

ఈ ఒక్క పాత్రే కాకుండా ఇలాంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లు ఎన్నో ఆయన్ను సాహసిగా నిలిపాయి. తనకెంతో పేరు తీసుకొచ్చిన ‘కటకటాల రుద్రయ్య’చిత్రీకరణలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర విషయాన్ని కృష్ణంరాజు ఓసారి బయటపెట్టారు. ఈ సినిమాలో కృష్ణంరాజు పులితో ఫైట్‌ చేసే సన్నివేశం ఒకటుంది. దాని కోసం చిత్ర బృందం ఓ పులిని తీసుకొచ్చింది. ఎంతటి శిక్షణ తీసుకున్నదైనా పులి.. పులే కాబట్టి సెట్స్‌లోకి రాగానే గాండ్రించిందట.

‘ఇలా అయితే కష్టం’ అని అనుకుని దాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారట కృష్ణంరాజు. చివరకు ఆ పోరాట దృశ్యాల్ని అనుకున్నట్టుగా తెరకెక్కించారు. సినిమా విడుదలై, ఘన విజయం అందుకోవడంతోపాటు ఆ ప్రత్యేక సీన్లకు మంచి ఆదరణ దక్కింది. అదే సంవత్సరం మరో సినిమా కోసం ఆ పులిని తీసుకురాగా, అది కృష్ణంరాజుతో ఫైట్‌ చేసేందుకు సహకరించలేదట.

‘ఆ పులి నన్ను గుర్తుపట్టి, ఎంతో చనువుగా ఉండేది. దాంతో ఫైట్‌ సీన్‌ అంటే కష్టమనుకుని మరొక పులిని తీసుకొచ్చాం’ అని కృష్ణంరాజు అప్పట్లో పేర్కొన్నారు. కృష్ణంరాజు స్నేహానికి మనుషులే కాదు.. పులి కూడా ఫిదా అవుతుందనటానికి ఇదొక నిదర్శనం.

Read more RELATED
Recommended to you

Latest news