ఓ.. బేబీ.. మూవీ రివ్యూ..

-

యూట‌ర్న్‌, సూప‌ర్ డీల‌క్స్ త‌దిత‌ర సినిమాల త‌రువాత స‌మంత న‌టించిన వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రం.. ఓ.. బేబీ.. కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా మొద‌ట్నుంచీ ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చింది.

యూట‌ర్న్‌, సూప‌ర్ డీల‌క్స్ త‌దిత‌ర సినిమాల త‌రువాత స‌మంత న‌టించిన వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రం.. ఓ.. బేబీ.. కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా మొద‌ట్నుంచీ ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ చిత్ర టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు మంచి స్పంద‌న ల‌భించ‌గా.. ఇవాళ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి.. ఓ.. బేబీగా స‌మంత ఎలా అల‌రించిందో తెలుసుకోవాలంటే.. ముందుగా మ‌నం చిత్ర క‌థ‌లోకి వెళ్లాల్సిందే..

ఓ.. బేబీ.. కథ‌..

సావిత్రి అలియాస్ బేబీ (ల‌క్ష్మి) 70 ఏళ్ల వృద్ధురాలు. ఆమె కుమారుడు శేఖ‌ర్ (రావు ర‌మేష్‌) అంటే ఆమెకు ప్రాణం. అయితే బేబీ స్వ‌త‌హాగానే అంద‌రినీ త‌న వ్యంగ్యాస్త్రాలు, వెట‌కారంతో న‌వ్విస్తూ, న‌వ్వుతూ ఉంటుంది. అలాగే ఆమెకు కాసింత చాద‌స్తం కూడా ఉంటుంది. కానీ బేబీ చూపించే ఆప్యాయ‌త‌ను ఆమె కోడ‌లు (ప్ర‌గ‌తి) అర్థం చేసుకోదు. అయితే ఒక స‌మ‌యంలో కోడ‌లు అస్వ‌స్థ‌త‌కు గురవుతుంది. దీంతో ఆ అస్వ‌స్థ‌త‌కు కార‌ణం బేబీనే అని మ‌నవ‌రాలు నిందిస్తుంది. దీంతో బేబీ ఇల్లు వ‌దిలి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. ఆ త‌రువాత ఆమె అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య 24 ఏళ్ల యువ‌తి స్వాతి (స‌మంత‌)గా మారిపోతుంది. ఈ క్ర‌మంలో యువ‌తిగా మారిన బేబీకి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి ? ఆమె త‌న కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తుంది ? త‌న కుటుంబానికి మ‌ళ్లీ ద‌గ్గ‌రైందా, లేదా ? అన్న వివ‌రాల‌ను వెండి తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

జీవితంలో చాలా మంది త‌మ‌కు మ‌ళ్లీ వెనుక‌టి రోజులు వ‌స్తే బాగుండున‌ని అనుకుంటుంటారు. దేవుడు త‌మ‌కు మరొక అవ‌కాశం ఇస్తే వెన‌క్కి వెళ్లి తాము కోరుక‌న్న జీవితాన్ని గ‌డ‌పాల‌ని చాలా మంది అనుకుంటారు. దాన్నే ఈ చిత్రంలో చూపించారు. 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువ‌తిగా మారితే ఆమె త‌న జీవితాన్ని ఎలా గ‌డుపుతుంది ? ఆమెకు ఎలాంటి ప‌రిస్థితుల ఎదుర‌వుతాయి ? అన్న అంశాల‌ను చిత్రంలో చ‌క్కగా చూపించారు. ఈ క్ర‌మంలో సినిమా మొద‌టి భాగంలో కామెడీని బాగా పండించారు. ఇక ద్వితీయార్థంలో బాగా ఎమోష‌న్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో తల్లీకొడుకుల బంధాన్ని చూపించ‌డంతో చ‌క్క‌ని సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే మ‌న‌వ‌డ్ని ఎంతో ప్రేమించే బేబీ అత‌ను త‌న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి ఆమె ఏం చేసింద‌నే విష‌యాన్ని చివ‌ర్లో అద్భుతంగా చూపించారు.

న‌టీన‌టుల ప‌నితీరు…

అయితే సినిమా క‌థ‌ ఇంట‌ర్వెల్ త‌రువాత కొంత నెమ్మ‌దిగా సాగుతుంది. కొన్ని స‌న్నివేశాల‌ను బాగా సాగ‌దీశార‌నే ఫీలింగ్ ప్రేక్ష‌కుల్లో వ‌స్తుంది. కామెడీతోపాటు ఎమోష‌న్లను కూడా ఈ సినిమాలో బాగా పండించారు. అయితే క‌థను కొరియ‌న్ మూవీ నుంచి తీసుకున్నా దానికి తెలుగులో అనేక మార్పులు చేర్పులు చేశారు. ఇక మూవీలో కొన్ని సీన్ల‌లో లాజిక్ మిస్ అయ్యామేమోన‌ని ప్రేక్ష‌కుల‌కు అనిపిస్తుంది. ఓ.. బేబీ.. మూవీలో స‌మంత న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ‌తాయి. అన్ని ర‌కాల స‌న్నివేశాల్లోనూ ఆమె అద్భుతంగా న‌టించింది. సెంటిమెంట్ స‌న్నివేశాల్లో ఆమె న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు కంట తడిని తెప్పిస్తుంది. ఇక న‌టి ల‌క్ష్మి గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె న‌టించింది కాదు, ఈ సినిమాలో జీవించింది అని చెబితే స‌రిపోతుంది. అలాగే రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌లు త‌మ పాత్ర‌ల‌కు సంపూర్ణ న్యాయం చేశార‌ని చెప్ప‌వ‌చ్చు.

ఈ మూవీలో నాగ‌శౌర్య పాత్ర చిన్న‌దే అయినా.. అత‌ను న‌ట‌న‌లో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచాడు. అలాగే బాల న‌టుడు తేజ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించాడు. జ‌గ‌ప‌తిబాబు, అడివిశేష్‌, నాగ‌చైత‌న్య‌లు అతిథి పాత్ర‌ల్లో క‌నిపించి అల‌రించారు. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ సంగీతం బాగా కుదిరింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంటాయి. అత్యున్న‌త స్థాయి ప్రొడ‌క్ష‌న్ విలువ‌ల‌తో మూవీని నిర్మించారు. కొరియ‌న్ సినిమాను అడాప్ట్ చేసుకున్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి తెలుగు నేటివిటీకి త‌గిన‌ట్లుగానే మూవీని తెరకెక్కించింది.

తీర్పు…

అంతిమంగా ఓ బేబీ.. కామెడీ, ఎమోష‌న్ క‌లిగిన చ‌క్క‌ని క‌మ‌ర్షియ‌ల్ చిత్ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వినోదం కోరుకునే వారు ఒక‌సారి ఈ సినిమా చూడ‌వ‌చ్చు. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఏ మేర డ‌బ్బులు వ‌సూలు చేస్తుందో చూడాలి.

రేటింగ్‌: 3/5

మూవీ: ఓ.. బేబీ..
న‌టీన‌టులు: సమంత‌, ల‌క్ష్మి, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, నాగ‌శౌర్య‌, ప్ర‌గ‌తి, తేజ
సంగీతం: మిక్కీ జే మేయ‌ర్
నిర్మాతలు: సురేష్‌బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్‌హు, థామస్ కిమ్
దర్శకత్వం: బి.వి.నందినిరెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news