రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇకపై కొత్తగా అడ్మిషన్ పొందే ఏ విద్యార్థి అయినా సరే.. కచ్చితంగా ఒక మొక్క నాటాలి. 4 ఏళ్ల వరకు దాని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలి.
పర్యావరణంలో సమతుల్యం లోపిస్తుండడం.. పర్యావరణాన్ని మనం నాశనం చేస్తుండడం వల్ల ఏటా భూతాపం పెరిగిపోవడంతోపాటు అనేక ప్రకృతి విపత్తులు, నష్టాలు సంభవిస్తున్న విషయం విదితమే. ఇక స్కూళ్లు, కాలేజీల్లో పేజీల కొద్దీ పర్యావరణ పరిరక్షణ పాఠాలను మనం నేర్చుకుంటూ ఉంటాం. రోడ్ల మీదకు వచ్చి పర్యావరణాన్ని రక్షించాలని నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తాం. కానీ ఆచరణలో మాత్రం పర్యావరణాన్ని రక్షించుకునేందుకు మనం ఏమీ చేయలేకపోతున్నాం. అయితే ఇదే విషయాన్ని గమనించిన రాజస్థాన్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. అందులో భాగంగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇకపై కొత్తగా అడ్మిషన్ పొందే ఏ విద్యార్థి అయినా సరే.. కచ్చితంగా ఒక మొక్క నాటాలి. 4 ఏళ్ల వరకు దాని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలి. ఈ ఏడాది నుంచే ఈ కొత్త నిబంధన అమలులోకి వచ్చిందని ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుభాష్ గార్గ్ తెలిపారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా.. ఆ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి కొత్తగా అడ్మిషన్ పొందే విద్యార్థులు క్యాంపస్‌లో 1 మొక్క నాటాలి. అనంతరం తమ విద్యాభ్యాసం ముగిసే వరకు (4 ఏళ్ల పాటు) దాన్ని సంరక్షించాల్సి ఉంటుంది.
ఇక ఈ కార్యక్రమం సరిగ్గా కొనసాగుతుందో లేదో తనిఖీ చేసేందుకు మంత్రి గార్గ్ ఆగస్టులో ఆయా ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేయనున్నారు. దీంతోపాటు కాలేజీల్లో విద్యార్థులు శ్రమదానం చేసి నీటి కొలనులను ఏర్పాటు చేయడంతోపాటు పర్యావరణహిత కార్యక్రమాలు కూడా చేపట్టేలా కాలేజీలు చొరవ తీసుకోవాలని సుభాష్ గార్గ్ సూచించారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెరుగుతుందని, ఇంజినీరింగ్ కాలేజీలు పచ్చదనంతో దర్శనమిస్తాయని ఆయన అన్నారు. ఏది ఏమైనా.. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం నిజంగా అభినందించదగినదే కదా.. దాంతో మన పర్యావరణానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది..!