- కేంద్రానికి యూపీఎస్సీ ప్రతిపాదన
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్ష సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో కీలక మార్పులను యూపీఎస్సీ తీసుకురానుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర జాతీయస్థాయి సర్వీసుల ఎంపికకు యూపీఎస్సీ ఏటా మూడంచెల విధానంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తోంది. అందులో మొదటి దశ అయిన ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్టు (సీశాట్) అనే రెండు పేపర్లు ఉంటాయి. రెండో పేపరుగా ఉన్న సీశాట్‌ను ఎత్తివేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) భావిస్తుంది. ఈ మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన విజన్ డాక్యుమెంట్లో ఈ ప్రతిపాదన చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఎనిమిదేళ్ల తర్వాత సివిల్స్‌లో భారీ మార్పు జరగనుంది. ఖన్నా కమిటీ సిఫారసు ఆధారంగా సీశాట్‌ను 2011లో ప్రవేశపెట్టారు.
దాంట్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోకపోయినా 33శాతం కనీస మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. ఈ పరీక్షల్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్ క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి. దాంట్లో ఆంగ్లం ఉండటం వల్ల తాము నష్టపోతామని గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుంచి వ్యతిరేకత రావడంతో.. దాన్ని కేవలం అర్హత పరీక్షగానే చూస్తామని, మార్కులను పరిగణనలోకి తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీశాట్ రద్దు ఎందుకు?
సీశాట్‌ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణిస్తున్నా ఇప్పటికీ గ్రామీణ అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఆ పేపర్ గణితం చదవని వారికి కష్టంగా ఉంటుందని, కేవలం గణితం చదివినవారి కోసమే పెట్టినట్లుగా ఉందన్న అభిప్రాయం ఇప్పటికీ బలంగా ఉంది.
పరీక్ష రాసేది సగం మందే
దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రాథమిక పరీక్షకు దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. వారిలో పరీక్ష రాస్తుంది మాత్రం 47-50 శాతం ఉంటున్నారు. భారీగా గైర్హాజరు వల్ల పరిపాలన యంత్రాంగంపై భారం పడుతుందని, దరఖాస్తు చేసిన అందరి కోసం ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని యూపీఎస్సీ భావిస్తోంది. దీన్ని నిరోధించాలంటే దరఖాస్తు చేసి పరీక్ష రాయకున్నా ఒకసారి రాసినట్లుగా పరిగణించాలి లేదా భారీగా జరిమానా విధించాలని యూపీఎస్సీ ప్రతిపాదన. ప్రస్తుతం జనరల్ కేటగిరీ వారు ఆరు సార్లు మాత్రం పరీక్ష రాయవచ్చు.
– కేశవ