ఓ నటుడిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ తన అభిమానాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలనన చేపడతామన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పరిపాలనను వికేంద్రీకరిస్తున్నామన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు కనీసం కరకట్ట కూడా వేయలేదని.. ఆయన కృత్రిమ ఉద్యమం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజల్లో లేని నాయకుడు అధికారంలోకి రావాలని చూస్తున్నాడన్నారు. వికేంద్రీకరణ పై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలతో ఎవరు రెచ్చిపోవద్దన్న సజ్జల.. బండ బూతులు తిడుతున్న వారికి మాత్రం బుద్ధి చెప్పాలన్నారు. సీఎం జగన్ ని విపక్షాలకు చెందిన నేతలు నోటికి వచ్చినట్లు తిడుతున్నారని.. తాము ఎదురు తిరిగితే తట్టుకోగలరా? అని హెచ్చరించారు.