మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ.. టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ట్రై చేస్తోంది.
టీఆర్ఎస్ ని ఉద్దేశిస్తూ ఉడత ఊపులకు కేసులకు భయపడే వాళ్లెవరూ లేరని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. పోలీసులు చట్టాన్ని గౌరవిస్తే.. వారిని తాము గౌరవిస్తామని చెప్పారు. అధికార పార్టీ తొత్తుల్లా వ్యవహరించి తమ కర్తవ్యాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు.
“సోషల్ మీడియాలో వాడు పోతుండు.. వీడు పోతుండని పిచ్చి రాతలు, పిచ్చికూతలు వస్తున్నాయి. నాటి కౌరవ యుద్ధంలో వంద మంది వేసుకొని వచ్చిన దుర్యోధనుడికి ఏలాంటి శాస్తి జరిగిందో.. రేపు మునుగోడులో కూడా అదే జరగబోతుంది. కేసీఆర్ ని ఫాంహౌస్ కి కేటీఆర్ ని.. అమెరికాకి కవితక్కను ఏదో వ్యాపారం పెట్టుకుంది అంట అక్కడికి పంపివ్వడం ఖాయం. కాళోజీ చెప్పినట్టు ఈ గడ్డ మీద పుట్టినోడు ఈ గడ్డకి అన్యాయం చేస్తే ఇక్కడే బొంద పెడతామని చెప్పినట్టు అన్యాయం చేసినోన్ని ఇక్కడే బొంద పెట్టాలి. రెడీగా ఉండండి.” అని రఘునందన్ రావు తీవ్రంగా మండిపడ్డారు.