రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారో స్పష్టం చేయాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు. నాణ్యమైన విద్యుత్ ఇస్తామంటున్న మంత్రి పెద్దిరెడ్డి ఆ నాణ్యత ఏంటో కరెంటు తీగలు పట్టుకుని చూపించాలని ఎద్దేవా చేశారు. కేంద్రం చెప్పిందని అత్యధిక ధరలకు రైతులతో విద్యుత్ మీటర్లు కొనుగోలు చేయించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఆరు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పంచాయతీలకు నిధుల్లేక సర్పంచులు అల్లాడుతున్నారని.. సచివాలయాలతో పరిపాలన చేస్తామంటున్న ప్రభుత్వం నిధులు మాత్రం ఇవ్వటం లేదన్నారు. గుజరాత్ తరహా అభివృద్ది అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రచారం బుడగ పేలి పోయిందన్నారు. గుజరాత్ లో జరిగిన అభివృద్ది ఏంటో దేశం మొత్తం చూసిందన్నారు.
ప్రమాదాన్ని మసిబూసి మారేడు కాయ చేయాలన్న బీజేపీ వైఖరి తేటతెల్లమైందన్నారు. నాలుగు సార్లు అధికారంలో ఉన్న బీజేపీనే ప్రమాదానికి భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలకు ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చని ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వస్తున్నారని.. ఆంధ్ర ప్రదేశ్ ను అధాని ప్రదేశ్ గా మార్చటానికి సీఎం జగన్ ప్రధానికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.