తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలో సాయంత్రం 6 గంటలకు ప్రచారపర్వానికి తెర పడింది. ఉపఎన్నిక ప్రచారంతో గత రెండు నెలలుగా మైకులు దద్దరిల్లగా.. ఇవాళ సాయంత్రం మైకులన్నీ మూగబోయాయి. చివరి దశలో పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తోన్నాయి. ఓటర్లకు ఆకట్టుకునే పనిలో తలమునకలయ్యాయి. చివరి నిమిషంలో ప్రలోభాల పర్వంలో పార్టీలు మరింత జోరు పెంచాయి. ప్రచార చివరిరోజు వీలైనంత మంది ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. నేడు సాయంత్రం ప్రచార గడువు ముగియడంతో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 6 గంటల తర్వాత నియోజకవర్గంలో ఉంటున్న స్థానికేతరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది.
స్థానికంగా ఓటు హక్కు లేనివాళ్లు ఎవరైనా నియోజకర్గంలో కనిపిస్తే ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారం చేయడానికి వీల్లేదని, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ జరిగే 48 గంటలకు ముందు ప్రచారాన్ని నిలిపియాల్సి ఉంటుంది. పోలింగ్ ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారం ఆపివేశారు. ఎన్నికల కోడ్ ప్రకారం ప్రచార గడువు ముగిసిన తర్వాత నుంచి కౌంటింగ్ ముగిసేవరకు
ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి ఉండదు. కౌంటింగ్ పూర్తిగా ముగిసిన తర్వాత ఈసీ కోడ్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేస్తోంది. ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో యధావిధిగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.