సిద్ధార్థ ఆత్మహత్యకు ఆయన చేసిన అప్పులే కారణమని కొందరు చెబుతుండగా.. నిజానికి ఆయనకు ఉన్న ఆస్తులతో పోలిస్తే అప్పులే చాలా తక్కువగా ఉన్నాయని.. తన ఆస్తుల్లో కొన్నింటిని అమ్మితే అప్పులను చాలా తేలిగ్గా కట్టవచ్చని.. అలాంటి స్థితిలో సిద్ధార్థ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని కూడా సందేహాలు వస్తున్నాయి.
కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ మంగళూరు నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. సోమవారం సాయంత్రం నుంచి ఆయన కనిపించకుండా పోయి ఇవాళ ఆయన నదిలో శవమై తేలారు. అయితే ఆయన అదృశ్యమైన ఘటనతోపాటు, ఆయన మృతి, ఆయన రాసినట్లుగా భావిస్తున్న లేఖ పోలీసులకు పలు అనుమానాలను కలిగిస్తున్నాయి.
సిద్ధార్థ రాసినట్లుగా భావిస్తున్న ఓ లేఖను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకోగా.. దాన్ని సిద్ధార్థ జూలై 27న రాసినట్లు ఉంది. అయితే ఆయన జూలై 29న అదృశ్యమయ్యారు. మరి ఆ లేఖ రాశాక ఆయన అదృశ్యమయ్యేందుకు రెండు రోజులు ఎందుకు పట్టిందని, అసలు ఆ లేఖ ఆయనే రాశాడా అని, అది ఆయన అదృశ్యమయ్యాకే ఎందుకు బయటకు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక సిద్ధార్థ ఆత్మహత్యకు ఆయన చేసిన అప్పులే కారణమని కొందరు చెబుతుండగా.. నిజానికి ఆయనకు ఉన్న ఆస్తులతో పోలిస్తే అప్పులే చాలా తక్కువగా ఉన్నాయని.. తన ఆస్తుల్లో కొన్నింటిని అమ్మితే అప్పులను చాలా తేలిగ్గా కట్టవచ్చని.. అలాంటి స్థితిలో సిద్ధార్థ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని కూడా సందేహాలు వస్తున్నాయి. ఇక సిద్ధార్థ సఖిలేష్ పూర్ వెళ్లాల్సి ఉందని, అలాటంప్పుడు ఆయన సడెన్‌గా మనస్సు మార్చుకుని మంగళూరుకు ఎందుకు వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక నేత్రావతి నది బ్రిడ్జి వద్ద ఆయన చివరి సారిగా ఎవరితో ఫోన్‌లో మాట్లాడారనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ మృతిపై పలు అనుమానాలున్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో మరిన్ని వివరాలు తెలిసే వరకు వేచి చూడక తప్పదని పోలీసులు తెలిపారు..!