మునుగోడు ఉప ఎన్నికకు బుధవారం పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లాలో పందేల జోరు హోరెత్తుతున్నది. బుధవారం పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారని సమాచారం. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తున్నది. టీఆర్ఎస్కు ఎంత మెజారీ వస్తుంది..? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి..? రెండు, మూడు స్థానాల్లో ఏ అభ్యర్థి ఉంటారు..? అని పందేలు విడివిడిగా కాస్తుండడం గమనార్హం. ఉభయ జిల్లాలే కాక ఇరు జిల్లాలను ఆనుకొని ఉన్న ఏపీలోని తిరువూరు, చాట్రాయి, నూజివీడు, నందిగామ, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లోనూ భారీగా పందేలు జరుగుతున్నాయి.
ఉప ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ, గెలుపు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రచారంలో పాల్గొన్న నాయకుల అభిప్రాయాలనూ పరిణనలోకి తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి గెలుస్తారని అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, సత్తుపల్లిలో కొందరు పందెంరాయుళ్లు ఏకంగా రూ.లక్ష వరకు పందేలు కాసినట్లు తెలుస్తున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడని కొందరు పందెం కాస్తే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏయే స్థానాల్లో నిలుస్తారని పందేలు సాగుతున్నాయి. అంతేకాదు విచిత్ర వేషధారణలతో ఎన్నికల ప్రచారం చేసిన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లు వస్తాయి? ఆయన డిపాజిట్ దక్కుతుందా? లేదా?అనే అంశాలపైనా బెట్టింగ్స్ జరుగుతుండడం విశేషం. ఈ నెల 6న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే.