తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహణంతో అమ్మవారి ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 9.45 గంటలకు మిథున లగ్నంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు.
ఆలయంలో అమ్మవారికి సుప్రభాతం నిర్వహించి యాగశాలలో గజపట ప్రతిష్ఠ కంకణభట్టార్ మణికంఠ బట్టర్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం , షోడషోపచారాలు నిర్వహించారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.
బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఉదయం, సాయంత్రం వాహన సేవలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో దంపతులతో పాటు , జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబు స్వామి, అధికారులు పాల్గొన్నారు.