కర్ణాటక తీర ప్రాంత నగరం మంగళూరులో శనివారం సాయంత్రం ఆటోరిక్షాలో జరిగిన చిన్నపాటి పేలుడుపై ఆ రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఘటన ఉగ్రవాద చర్యేనని ధ్రువీకరించారు. పెద్ద ఎత్తున నష్టం కలగజేయాలన్న దురుద్దేశంతోనే దుండగులు ఈ చర్యకు ఒడిగట్టారని వెల్లడించారు. దీనిపై లోతైన విచారణ జరపుతున్నామని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం కూడా తీసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాన్ని కర్ణాటక హోంమంత్రి అరాగా జ్ఞానేంద్ర సైతం ధ్రువీకరించారు.
మంగళూరులో శనివారం సాయంత్రం ఓ ఆటోరిక్షాలో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఓ ప్రయాణికుడు గాయపడ్డారు. తొలుత ఇది పేలుడా.. లేక అగ్నిప్రమాదమా.. ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీస్ కమిషనర్ శశి కుమార్ ఆటోలో మంటలంటుకున్నాయని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
పేలుడు అని ధ్రువీకరించడానికి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులతో పాటు ప్రత్యేక బృందం దీనిపై దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. తాజాగా ఇది ఉగ్రవాద చర్యేనని డీజీపీ ధ్రువీకరించడం గమనార్హం.