హిందూ సంప్రదాయం ప్రకారం హైందవ దేవాలయాల్లో పుట్టి సంవత్సరం పూర్తైన బిడ్డకు కేశఖండన చేయడం సంప్రదాయంగా వస్తుంది. చిన్న,పెద్ద, ఆడ, మగ అనే భేధం లేకుండా తమ ఇలవేల్పుకు తలనీలాలు సమర్పిస్తుంటాం.. ఇక భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరుడుకి ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తుంటారు. దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తారు. ముందుగా తిరుమలకు చేరుకున్న భక్తులు స్వామి వారి దర్శనంకంటే ముందు టిటిడి ఏర్పాటు చేసిన కళ్యాణకట్టకు చేరుకుని భక్తి భావంతో తలనీలాలు సమర్పిస్తుంటారు.
ఈ సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం తిరుమల వెంకటేశ్వరస్వామికి భక్తుల తలనీలాల రూపంలో భారీ ఆదాయం లభించిందని టీటీడీ సమాచారం. దేశం నలుమూలల నుంచి తిరుమల వచ్చే భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. ఈ తలనీలాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతి ఏటా ఆన్ లైన్ లో వేలం వేస్తుంది. ఈ తలనీలాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈసారి టీటీడీ 21,100 కిలోల తలనీలాలను వేలంలో ఉంచగా, కళ్లు చెదిరే స్థాయిలో మొత్తం రూ.47.92 కోట్ల ధర పలికింది. వేలం వేసిన తలనీలాల్లో వివిధ సైజులు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఈ తలనీలాలను గ్రేడింగ్ చేస్తారు.
ఫస్ట్ గ్రేడ్- 27 అంగుళాల తలనీలాలు
సెకండ్ గ్రేడ్- 19 నుంచి 26 అంగుళాలు
థర్డ్ గ్రేడ్- 10 నుంచి 18 అంగుళాలు
ఫోర్త్ గ్రేడ్- 5 నుంచి 9 అంగుళాలు
ఫిఫ్త్ గ్రేడ్- 5 అంగుళాల కంటే తక్కువ