నేడు సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సబ్ స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్ పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ కాలనీలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని.. ప్రజల భద్రత కోసమే పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించామన్నారు. దేశంలోనే ఇన్ని సౌకర్యాలు ఉన్న పేద ప్రజల వసతి గృహం మరెక్కడా లేదన్నారు మంత్రి.
ఇక పేదలకు ఇచ్చిన ఇల్లు తాళం వేసినా, లేదా ఇంకెవరికైనా కిరాయికి ఇచ్చిన ఆ ఇల్లుని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. త్వరలోనే అక్కడ ఐదు కోట్లతో ఎల్ అండ్ టి ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభిస్తామన్నారు. ఇక ఈ కాలనీలో నీ ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కకుండా ఉండాలని సూచించారు. పోలీసు సిబ్బంది కూడా వాహనాలకు కొంచెం చలాన్లు తగ్గించి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఇక సిద్దిపేటలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. 3000 మందికి నేడు పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. త్వరలోనే అందరితో కలిసి సామూహిక గృహప్రవేశాలు చేద్దామన్నారు మంత్రి. త్వరలోనే మరో వెయ్యి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. గతంలో లబ్ది పొందని పేద జర్నలిస్టుల కోసం మరో మూడు బ్లాకులు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే దళిత బందులో కూడా జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు.