రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు(ఆదివారం) ఏపీ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి హోదాలో ఆమె తొలిసారిగా ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. సభా ప్రాంగణం మురళీ రిసార్ట్స్‌కు వెళ్లే పోరంకి- నిడమానూరు మార్గానికి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పిచ్చి చెట్లను, ముళ్ల కంపను ప్రత్యేక యంత్రాలతో తొలగించే పనిలో అధికారులు బిజిగా ఉన్నారు. రహదారులను సుందరంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా గుంతలను పూడ్చి అవసరం అయిన చోట రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. నారాయణపురం కాలనీ సమీపంలో విశాలమైన ప్రదేశంలో వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని ఎంపిక చేసి, అక్కడ బుల్ డోజర్లతో చదును చేశారు అధికారులు.
కిలోమీటర్ దూరం నుంచి సభాప్రాంగణం వరకు రోడ్డుకు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోరంకి- నిడమానూరు రోడ్డులో ఆధునాతన ఎత్తయిన స్తంభాలను నూతనంగా ఏర్పాటు చేశారు. అయితే.. గతంలోనూ రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు.