ఏటీఎం నుంచి పైసలు తీసుకుంటాం..కానీ బంగారం తీసే వీలుంటే.. అవును ఆ ఏటీఎం నుంచి గోల్డ్ డ్రా చేసుకోవచ్చట.. దేశంలోనే తొలిసారిగా.. మన హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం ఏర్పాటు చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఏర్పాటు కానున్నాయట.. డైరెక్టుగా ఏటీఎం ద్వారా గోల్డ్ కొనుగోలు చేయొచ్చట.. అబ్బా ఇందంతా వింటుంటే.. మీకు ఇప్పటికే వంద డౌట్లు వచ్చి ఉండాలే.. అసలు ఏటీఎంలో గోల్డ్ ఎలా వస్తుంది. కాయిన్స్ వస్తాయా, నగలు వస్తాయా..? బయటకు వచ్చాక నచ్చకుంటే ఎలా..?
దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. గోల్డ్ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏటీఎంల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డు సహాయంతో బంగారం విత్‌డ్రా చేసుకోవచ్చట.
ఈ గోల్ట్ ఏటీఎం ద్వారా 99.99శాతం క్వాలిటీ కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు విత్ డ్రా చేసుకోవచ్చని గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ అంటున్నారు. నాణేల నాణ్యత, గ్యారెంటీ తెలిపే పత్రాలు కూడా జారీ అవుతాయట. త్వరలోనే నగరంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు…. వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి ఈ గోల్డ్ ఏటీఎంలే నిదర్శనమని ఆమె తెలిపారు. దేశంలోనే తొలిసారి గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్ నగరంలో ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు.
అంతా బానే ఉంది కానీ.. డబ్బులు వచ్చే ఏటీఎంలోనే విపరీతంగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఏటీఎంలో వచ్చే డబ్బులు నకిలీవి అవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.. మరీ గోల్డ్‌ను తీసుకొచ్చి ఏటీఎంలో పెడితే అది సెఫ్టీయేనా.. వచ్చే గోల్డ్ ప్యూర్ ఉంటుందని అంటున్నారు.. కానీ ఎంత వరకు నమ్మొచ్చు. మన వాళ్లు గోల్డ్ షాప్‌కు వెళ్లే గంటలు గంటలు చూస్తారు. మరి అలాంటిది ఈ ఐడియా క్లిక్ అవుతుందంటారా..?